
ఎన్నికల్లో తమకు ఎదురులేదని టీఆర్‌ఎస్ మరోసారి నిరూపించుకుంది. ప్రాదేశిక ఎన్నికల్లోనూ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలకు 18, ఎంపీటీసీ స్థానాలు 189కి 117 కైవసం చేసుకుని ‘కారు’ సత్తా చాటుకుంది. కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. బీజేపీ ఖాతా తెరవకుండా చతికిలబడింది. మరోవైపు గెలిచిన స్వతంత్రుల్లో చాలా మంది టీఆర్‌ఎస్ రెబల్స్ ఉండడం విశేషం. టీఆర్‌ఎస్ గెలుపుతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి.
సాక్షి, మెదక్ : జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ‘గులాబీ’ గుబాళించింది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ‘కారు’ జోరు కొనసాగగా.. ప్రాదేశిక ఎన్నికల్లోనూ అదే హవా వీచింది. జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలకు 18... 189 ఎంపీటీసీలకు 117 స్థానాల్లో విజయం సాధించి.. మరోసారి సత్తా చాటుకుంది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా.. పలు చోట్ల మాత్రమే పోటీలో ఉన్న బీజేపీ ఖాతా తెరవడంలో విఫలమైంది. మరోవైపు గెలిచిన 28 మంది స్వతంత్రుల్లో చాలా మంది టీఆర్‌ఎస్ రెబల్స్ ఉండడం విశేషం. మొత్తానికీ.. తొలి జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని టీఆర్‌ఎస్ చేజిక్కించుకునేలా ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించగా.. ఎంపీపీ స్థానాలు సైతం అధికంగా ‘కారు’కే దక్కనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 7న ఎంపీపీ, వైస్ ఎంపీపీలు.. 8న జెడ్పీచైర్మన్లు/జెడ్పీ చైర్‌పర్సన్లను, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు
జిల్లాలో గత నెల ఆరు, పది, 14వ తేదీల్లో మూడు విడతలుగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో ఆరు మండలాల పరిధిలో.. రెండో విడతలో ఆరు మండలాల పరిధిలో.. చివరి విడతలో ఎనిమిది మండలాల పరిధిలో ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 20 జెడ్పీటీసీ.. 189 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 20 జెడ్పీటీసీ స్థానాలకు 74 మంది పోటీపడ్డారు. అదేవిధంగా.. 189 ఎంపీటీసీ స్థానాల్లో ఐదు ఏకగ్రీవం (జూపల్లి, చండి, దామెర చెరువు, రాయిలాపూర్, నందగోకుల్) అయ్యాయి. ఇవిపోనూ మిగిలిన 184 స్థానాల్లో 582 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ రీ షెడ్యూల్ ప్రకారం పోలీసుల భారీ బందోబస్తు మధ్య జిల్లాల్లో ఏర్పాటు చేసిన నాలుగు కౌంటింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ బండిల్స్ వేరు చేశారు. సుమారు ఉదయం 11.30 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత ముందుగా ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. లంచ్ తర్వాత అధికారులు జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు.
14 ఎంపీపీ స్థానాలు టీఆర్‌ఎస్‌వే.. మూడింటిలో స్వతంత్రులే కీలకం
జిల్లాలో 20 ఎంపీపీ స్థానాలు ఉండగా.. మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోనుంది. ఈ మేరకు ఆధిక్యం వచ్చింది. మొత్తం 20 ఎంపీపీ స్థానాల్లో 14 పీఠాలు ‘గులాబీ’కే చెందుతాయనేది సుస్పష్టం. చిన్నశంకరంపేట, టేక్మాల్‌లో కాంగ్రెస్‌దే ఆధిపత్యం కాగా.. నార్సింగి, తూప్రాన్, వెల్దుర్తి పీఠాలు అటా.. ఇటా అన్నట్లు ఉన్నాయి. ఈ మూడు స్థానాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. నార్సింగికి సంబంధించి మొత్తం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్ రెండు, కాంగ్రెస్ ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. స్వతంత్రులు ఎటు మొగ్గు చూపితే వారే ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూప్రాన్‌లో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ రెండు, టీఆర్‌ఎస్ ఒకటి, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. ఇక్కడ స్వతంత్రులు కీలకం కానున్నారు. వెల్దుర్తిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ ఐదు, టీఆర్‌ఎస్ నాలుగు, స్వతంత్రులు ముగ్గురు విజయం సాధించారు. ఇండిపెండెంట్లు ముగ్గురు మూకుమ్మడిగా ఎటు మొగ్గు చూపుతారో.. వారే ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోనున్నారు. చేగుంటలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా టీఆర్‌ఎస్ నాలుగుచోట్ల విజయం సాధించగా స్వతంత్రులు 9 చోట్ల గెలుపొందారు. ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచినవారిలో టీఆర్‌ఎస్ రెబల్స్ అధికంగా ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన చేగుంట పీఠం టీఆర్‌ఎస్‌కు దక్కే అవకాశం ఉంది.
జెడ్పీటీసీ విజేతలు వీరే..
- పెద్దశంకరంపేట జెడ్పీటీసీ స్థానాన్ని ‘కారు’ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయరామరాజు 1,251 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. టీఆర్‌ఎస్‌కు 12,316 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి రాయిని మధుకు 11,021 ఓట్లు వచ్చాయి.
- రేగోడు జెడ్పీటీసీగా కాంగ్రెస్ అభ్యర్థి యాదగిరి 855 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈయనకు 7,274 ఓట్లురాగా.. సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌కు చెందిన వినోద్‌కుమార్‌కు 6,399 ఓట్లు పోలయ్యాయి.
- హవేళిఘణాపూర్ జెడ్పీటీసీ సభ్యురాలిగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాత 5,728 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని భూదేవిపై గెలుపొందారు. సుజాతకు 12,930 ఓట్లు రాగా.. భూదేవికి 7,202 ఓట్లు మాత్రమే వచ్చాయి.
- చిన్నశంకరంపేట జెడ్పీటీసీ సభ్యురాలిగా టీఆర్‌ఎస్ అభ్యర్థిని మాధవిరాజు 3512 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈమెకు 12525 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన ప్రియానాయక్‌కు 9013 ఓట్లు మాత్రమే దక్కాయి.
- టేక్మాల్ జెడ్పీటీసీగా కాంగ్రెస్ అభ్యర్థి శర్వాణి సరోజ 1,713 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈమెకు 10,507 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌కు చెందిన ఇస్తారి స్వప్నకు 8,794 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
- నిజాంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌కు చెందిన పంజా విజయ్‌కుమార్ 5,517 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈయనకు 9558 ఓట్లు రాగా.. ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన లింగంగౌడ్‌కు 4041 ఓట్లు మాత్రమే వచ్చాయి.
- మెదక్ జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి లావణ్యరెడ్డి 2,165 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమెకు 7,763 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన హైమావతికి 5,598 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
- వెల్దుర్తి జెడ్పీటీసీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌కు చెందిన రమేష్‌గౌడ్ 977 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈయనకు 10,729 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి నర్సింహారెడ్డికి 9,752 ఓట్లు మాత్రమే దక్కాయి.
- అల్లాదుర్గం జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌కు చెందిన సౌందర్య 308 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈమెకు 8,006 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మికి 7,698 ఓట్లు మాత్రమే వచ్చాయి.
- శివ్వంపేట జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి మహేష్‌గుప్తా 12,350 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈయనకు 17,888 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థికి 5,595 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
- నర్సాపూర్ జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి బాబ్యనాయక్ 2,779 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాయక్‌కు 11,386 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి దేవిసింగ్‌కు 8,607 ఓట్లు మాత్రమే వచ్చాయి.
- తూప్రాన్ జెడ్పీటీసీ సభ్యురాలిగా టీఆర్‌ఎస్ అభ్యర్థిని బసవన్నగారి రాణి 1,804 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. టీఆర్‌ఎస్‌కు 5,915 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన ఆకుల రాజమణికి 4,111 ఓట్లు మాత్రమే దక్కాయి.
- చేగుంట జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ముదం శ్రీనివాస్ 1,456 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈయనకు 10,338 ఓట్లు రాగా.. ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి రాజిరెడ్డికి 8,882 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
- నార్సింగి జెడ్పీటీసీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌కు చెందిన భానపురం కృష్ణారెడ్డి 960 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈయనకు 4,378 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి రమణకు 3,418 ఓట్లు మాత్రమే వచ్చాయి.
- మనోహరాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలిగా టీఆర్‌ఎస్‌కు చెందిన ర్యాకల హేమలత శేఖర్‌గౌడ్ 5,579 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమెకు 9,638 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు 4,059 ఓట్లు మాత్రమే దక్కాయి.
- పాపన్నపేట జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్ అభ్యర్థిని షర్మిలారెడ్డి గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిని జంగం స్వప్నపై 6,770 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. షర్మిలారెడ్డికి 18,423.. స్వప్నకు 11,653 ఓట్లు వచ్చాయి.
- చిలప్‌చెడ్ జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌కు చెందిన చిలుముల శేషసాయిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డిపై 4,447 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శేషసాయిరెడ్డికి 8,260 ఓట్లు, నారాయణరెడ్డికి 3,813 ఓట్లు పోలయ్యాయి.
- రామాయంపేట జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్ అభ్యర్థిని సంధ్య 2,858 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈమెకు 6,259 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన రాజేశ్వరికి 3,401 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థిని రాధకు 3,311 ఓట్లు పోలయ్యాయి.
- కౌడిపల్లి జెడ్పీటీగా టీఆర్‌ఎస్‌కు చెందిన కవిత 5,823 ఓట్ల ఆధిక్యంతో విజయబావుటా ఎగురవేశారు. ఈమెకు 12,752 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థిని అనితకు 6,929 ఓట్లు వచ్చాయి.
- కొల్చారం జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్యంగారి మేఘమాల గెలుపొందారు. ఆమెకు 11,631 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థికి 6,065 ఓట్లు వచ్చాయి. 5,566 ఓట్ల తేడాతో మేఘమాల విజయం సాధించారు.
చిన్నశంకరంపేట, చేగుంటలో క్రాస్‌ఓటింగ్
చిన్న శంకరంపేట మండలంలో క్రాస్‌ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్ నాలుగు, కాంగ్రెస్ ఏడు, స్వతంత్రులు ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఆధిక్యం కాగా.. జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి టీఆర్‌ఎస్ అభ్యర్థి 3,512 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం గమనార్హం. చేగుంటలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. తొమ్మిది స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. టీఆర్‌ఎస్ నాలుగుకే పరిమి తమైంది. ఇదే క్రమంలో జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థి 1,456 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment