వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో చర్చిస్తున్న ఎస్‌ఐలు
సాక్షి, సీఎస్‌పురం (ప్రకాశం): మండల కేంద్రం సీఎస్‌పురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ తోబుట్టువుకు పుట్టింటి కానుకగా మండలంలోని మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగు రోజులుగా సీఎస్‌పురం పంచాయతీలోని గ్రామాల్లో చీరలు పంపిణీ చేస్తున్నారు. సీఎస్‌పురంలోని ఏనిమిట్ట వీధిలో చీరలు పంపిణీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బొబ్బూరి రమేష్ శుక్రవారం రాత్రి దౌర్జన్యం చేసి చీరల పంపిణీని అడ్డుకున్నాడు.
యువకులను బూతులు తిట్టడమేగాక అక్కడే ఉన్న మాజీ ఎంపీపీ భువనగిరి వెంకటయ్య పట్ల దురుసుగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి వెంకటయ్యపై టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారని ప్రచారం సాగడంతో మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శనివారం ఉదయం సీఎస్‌పురం చేరారు. సీఎస్‌పురం, పామూరు ఎస్‌ఐలు శివనాంచారయ్య, రాజ్‌కుమార్‌లు అప్రమత్తమై గుమిగూడిన ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఇరుపార్టీల నాయకులను పోలీసుస్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపారు. భువనగిరి వెంకటయ్యకు బొబ్బూరి రమేష్ క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment