
తమపై జరిగిన దాడిని ఎస్సైకు వివరిస్తున్న గిరిజన మహిళలు,దాడిలో గాయపడిన అంబూరు రాములమ్మ
సూళ్లూరుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు వెళ్లినందుకు గిరిజన మహిళలపై ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు దాడిచేసి, గాయపరిచిన ఘటన శుక్రవారం జరిగింది. ఈ మేరకు దాడిలో గాయపడిన మహిళలు స్థానిక ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాల మేరకు.. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత బుధవారం నాయుడుపేటలో జగన్‌మోహన్‌రెడ్డి సభ జరిగింది. ఈ సభకు సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలోని మన్నారుపోలూరు ఎన్టీఆర్ గిరిజన కాలనీకి చెందిన మహిళలు వెళ్లారు. దీంతో ఈ కాలనీ పక్కనే ఉంటున్న కార్డు అనే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు కమలకుమారి.. తనకు చెప్పకుండా సభకు ఎందుకు వెళ్లారని గిరిజన మహిళలపై దాడి చేశారు.
తన సోదరి, మరో ఇద్దరితో కలిసి తమ ఇళ్లల్లో చొరబడి సాటి ఆడవాళ్లని కూడా చూడకుండా చీరలు, జాకెట్లు చించి రౌడీల్లా దాడిచేశారని బాధిత గిరిజన మహిళలు వాపోయారు. ముందుగా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పెనుబేటి మారెమ్మపై కక్షకట్టి ఆమెపై దాడిచేసి, జుట్టు పట్టుకుని ఈడ్చి కాళ్లతో తన్నారని, అడ్డం వచ్చిన పెరి మేటి అంకమ్మ, అంబూరు రాములమ్మతో పాటు మరో నలుగురు మహిళలపై కూడా దాడిచేసి గాయపరిచారని ఎస్సైకు వివరించారు. జగన్ సభకు ఎవరెవరు వెళ్లారో.. వారికి ఇళ్లే లేకుండా చేసేస్తాన ని కమలకుమారి బెదిరిం చారని పేర్కొన్నారు. ఆమెకు ఆర్థిక, అంగబలం ఉందని, తమను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తోందని వాపోయారు. ఆమె ఎప్పుడైనా తమపై దాడి చేయిస్తుందని, తమకు రక్షణ కల్పించాలని బాధిత మహిళలు కోరారు. గిరిజనులు కేసు పెట్టారని తెలిసి కమలకుమారి కూడా గిరిజనులు తనపై దాడికి పాల్ప డ్డారని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment