మహేశ్వరం: యువతిని ప్రేమించి.. కులాంతార వివాహం చేసుకున్న ఓ యువకుడు కట్నం తీసుకురావాలని ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తల్లిదండ్రులు, బంధువుల మాటలు విని వేధించసాగాడు. కట్నం తీసుకురాకపోవడంతో ఆస్పత్రికి వెళ్తున్నానంటూ చెప్పి ఇంట్లోంచి పరారయ్యాడు. దీంతో యువతి తన అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఘట్టుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గొసుల శ్రీకాంత్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన బైకని శిరీషయాదవ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో గత సంవత్సరం ఏప్రిల్ 27న ఇంట్లో నుంచి వెళ్లిపోయి విజయవాడ కనకదుర్గా ఆలయంలో వివాహం చేసుకున్నారు.
శ్రీకాంత్‌రెడ్డి విద్యావలంటీర్‌గా పనిచేస్తున్నాడు. దంపతులు నగరంలోని కర్మన్‌ఘట్‌లో దంపతులు కాపురం పెట్టారు. కొంతకాలంగా మహేశ్వరం మండల కేంద్రంలో ఉంటున్నారు. అయితే, శ్రీకాంత్‌రెడ్డి తల్లిదండ్రులు, తన పిన్ని , చెల్లెలు, తమ్ముళ్ల చెప్పుడు మాటలు విని నిత్యం తనను వేధిస్తూ కొట్టేవాడని శిరీషయాదవ్ తెలిపింది. తక్కువ సామాజికి వర్గానికి చెందిన యువతిని వివాహం చేసుకొని పరువు తీశావు.. మన వర్గంలో పెళ్లి చేసుకుంటే కట్నకానుకలు భారీగా వచ్చేవని, ఎలాగైనా శిరీషను వదిలేయాలని శ్రీకాంత్‌రెడ్డికి కుటుంబీకులు, బంధువులు నూరిపోశారు. ఈక్రమంలో అతడు కులం పేరుతో దూషిస్తూ భార్యను వేధిస్తూ కొట్టేవాడు.
దీంతో గతంలో ఇరువర్గాల పెద్దలు పంచాయితీ పెట్టారు. 15 తులాల బంగారం, అర ఎకరం పొలం ఇస్తామని శిరీషయాదవ్ కుటుంబీకులు హామీ ఇచ్చారు. రోజులు గడుస్తున్నా హామీ నిలబెట్టుకోవడం లేదని, కట్న కానుకలు ఇవ్వడం లేదని శ్రీకాంత్‌రెడ్డితోపాటు పిన్నీ, బంధువులు శిరీషయాదవ్‌పై దాడి చేయసాగారు. నాలుగు రోజుల క్రితం శ్రీకాంత్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లివస్తానంటూ ఇంట్లోంచి పరారయ్యాడు. దీంతో శిరీషయాదవ్ అనుమానించి తన అత్తగారిల్లు ఘట్టుపల్లికి వెళ్లి చూడగా అత్తామామలు, కుటుంబీకులు ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. తనకు న్యాయం చేయాలని ఆమె మహేశ్వరం పోలీసులను ఆశ్రయించింది. అనంతరం తన అత్తగారింటి ఎదుట నిరసన చేపట్టింది. తన భర్త, అత్తమామలను పిలిపించి భర్తతో కాపురం చేయించేలా చూడాలని కోరింది. గురువారం భర్త, కుటుంబీకులను పిలిపించి మాట్లాడుతామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment