కొత్త ఏడాది... కాస్తమారాలి | Invest In Equity Mutual Funds | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాది... కాస్తమారాలి

Published Mon, Jan 15 2018 12:06 AM | Last Updated on Mon, Jan 15 2018 12:06 AM

Invest In Equity Mutual Funds - Sakshi

(సాక్షి, బిజినెస్‌ విభాగం) : ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేసినవారందరికీ 2017వ సంవత్సరం మంచి రాబడులను పంచి పెట్టింది. రెరా చట్టం వచ్చినా రియల్‌ ఎస్టేట్‌ రంగం పెద్దగా పుంజుకున్నది లేదు. బినామీ ఆస్తుల చట్టం, జీఎస్టీ వంటి ప్రతిబంధకాలూ ఎదురయ్యాయి. రియల్టీ విషయంలో నూతన సంవత్సరం భిన్నంగా ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. ఇక డెట్‌ మార్కెట్‌... అంటే బాండ్లలోను, డెట్‌ ఫండ్స్‌లోను పెట్టుబడులు పెట్టాలంటే వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా లేవు. బంగారమైతే పెద్దగా పెరగకపోయినా స్థిరంగా కొనసాగుతోంది. దీని కదలికలు ఇక ముందూ ఇదే తీరులో ఉంటాయన్న అంచనాలున్నాయి. మరి 2018లో మంచి రాబడులు రావాలంటే ఏం చేయాలి? ఏ సాధనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? పెట్టుబడుల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇదే విషయమై పలువురు నిపుణులతో ‘సాక్షి’ పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం ప్రతినిధులు మాట్లాడారు. వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం...

రీ బ్యాలెన్స్‌ తప్పనిసరి...
2017లో మార్కెట్ల ర్యాలీతో ఈక్విటీ పెట్టుబడుల విలువ పుంజుకుని ఉంటుంది. కనుక పెరిగిన విలువకు తగినట్టు ఆ పెట్టుబడులను ఇప్పుడే రీ బ్యాలెన్స్‌ చేయాల్సిన అవసరముంది. అయితే, మార్కెట్లు బులిష్‌గా ఉన్న ఈ తరుణంలో ఈక్విటీలో పెట్టుబడులను తగ్గించుకోవటం అన్నది ప్రతికూలంగానే అనిపించొచ్చు. అయితే, ప్రతి ఇన్వెస్టర్‌కు ఫలానా సాధనంలో ఇంత శాతం పెట్టుబడులు పెట్టాలన్న (అస్సెట్‌ అలోకేషన్‌) ప్లాన్‌ ఒకటి ఉంటుంది. ఉదాహరణకు మిగులు నిధుల్లో 25 శాతం ఈక్విటీ, 25 శాతం డెట్, 25 శాతం బంగారం, 25 శాతం రియల్టీ అనుకుని ఉండొచ్చు. ‘‘ఈ పెట్టుబడుల విలువ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కనుక విలువకు తగినట్టు మార్పులు చేసుకోవడం అన్నది తెలివైన చర్య. పెట్టుబడులను క్రమానుగతంగా సమీక్షించుకుంటూ, అవసరమైతే నిర్ణీత శాతం మేర పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకోవాలి’’ అని ఎడెల్‌వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో రాధికా గుప్తా సూచించారు.

మిడ్, స్మాల్‌ క్యాప్స్‌లో పెట్టుబడులు
2017లో సెన్సెక్స్‌ 28 శాతం పెరిగింది. కానీ, స్మాల్, మిడ్‌క్యాప్‌ సూచీలు ఇంకా ఎక్కువే రాబడులు ఇచ్చాయి. నిపుణుల సూచన ఏమంటే అధిక విలువలకు చేరిన మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ప్రస్తుత స్థాయిలో వాటికి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు. ఎందుకంటే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ పీఈ 46.7 రెట్లయితే... స్మాల్‌క్యాప్‌ సూచీ పీఈ ఏకంగా 114.5 రెట్లకు చేరింది. మిడ్, స్మాల్‌ క్యాప్‌లో పెట్టుబడి పెట్టేందుకు ప్రత్యేకంగా ఆరంభమైన పలు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు స్టాక్స్‌ అధిక వ్యాల్యూషన్ల నేపథ్యంలో కొత్తగా పెట్టుబడులను తీసుకోవడం తాత్కాలికంగా నిలిపివేశాయి. రిస్క్‌ కొద్దీ రాబడుల దృష్ట్యా ప్రస్తుతానికి లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ అన్నవి తగిన ఎంపిక అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో, ఈడీ శంకరన్‌ నరేన్‌ అభిప్రాయపడ్డారు.

షార్ట్‌టర్మ్‌ డెట్‌ పథకాలు చూడొచ్చు
2017లో డెట్‌ఫండ్స్‌ రాబడులు చిన్నబోయాయి. అంతకుముందు ఒకటి రెండు సంవత్సరాల కాలంలో ఇవి రెండంకెల స్థాయిలో రాబడులనిచ్చాయి. దీంతో గత సంవత్సరం రాబడులు నిరాశపరిచినట్లే భావించాల్సి ఉంటుంది. చమురు ధరలు పెరగడం, ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడంపై ఉన్న ఆందోళనలు బాండ్‌ మార్కెట్‌కు ప్రతికూలంగా మారాయి. అయితే, ఇన్వెస్టర్లు స్వల్పకాలిక డెట్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని, వీటిలో అంత అస్థిరతలు ఉండవని, స్థిరమైన రాబడులు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పన్ను రహిత రాబడుల కోసం...
స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వారికి మార్కెట్ల ర్యాలీ కారణంగా మంచి రాబడులొచ్చి ఉంటాయి. దీంతో లాభాల స్వీకరణకు ఇది సరైన సమయమనేది నిపుణుల సూచన. స్టాక్స్‌ను విక్రయించేసి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ప్రయోజనాలను పొందాలని, తిరిగి అవే స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవాలని పేర్కొంటున్నారు. తాజాగా కొనుగోలు చేసిన ధర నుంచి స్టాక్స్‌ ధరలు ఒకవేళ పడిపోతే స్వల్పకాలిక నష్టాలను బుక్‌ చేసుకోవచ్చని, ఈ నష్టాలను ఇతర క్యాపిటల్‌ గెయిన్స్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సర్దుబాటు చేసుకోవచ్చని లేదా ఎనిమిది ఆర్థిక సంవత్సరాల వరకు వాటిని పొందే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

రిటైర్మెంట్‌ కోసం ఎన్‌పీఎస్‌
అతి తక్కువ చార్జీలతో కూడిన ఎన్‌పీఎస్‌ పథకం... దేశీయ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్న రిటైర్మెంట్‌ పథకాల్లో అత్యంత చౌకయినదని చెప్పొచ్చు. ప్రత్యేక అవసరాల్లో పాక్షిక ఉపసంహరణలు, రిటైర్‌ అయిన తర్వాత కూడా పెట్టుబడులు పదేళ్ల వరకు కొనసాగించుకునే అవకాశం... ఇవన్నీ ఎన్‌పీఎస్‌ ఇన్వెస్టర్లకు పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఎన్‌పీఎస్‌ ఖాతాను ఇప్పుడు చాలా సులభంగా ఆన్‌లైన్‌ విధానంలోనే ప్రారంభించుకోవచ్చు. ఆధార్‌కు బ్యాంకు ఖాతా, పాన్‌ లింక్‌ అనుసంధానమై ఉంటే ఎన్‌పీఎస్‌ ఖాతాను ఆన్‌లైన్‌లో అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రారంభించుకోవచ్చు.

ఇంటి రుణం ముందే తీర్చేస్తే సరి
ఇల్లు అద్దెకు ఇవ్వకపోయినట్టయితే ఆ ఇంటి కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీకి పూర్తిగా పన్ను మినహాయింపు ఉండేది. అధిక నికర విలువ కలిగిన ఇన్వెస్టర్లు తమ పన్ను భారం తగ్గించుకునేందుకు ఈ నిబంధనను ఉపయోగించుకునే వారు. కోటి రూపాయల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి 8.75 శాతం వడ్డీ రేటుకు తీసుకుని ఉంటే  రూ.8.67 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అవకాశం లభిస్తుంది. దీంతో రుణం తీసుకున్న వారిపై పన్ను భారం మొదటి సంవత్సరం రూ.2.5 లక్షల మేర తగ్గుతుంది. అయితే, గత బడ్జెట్‌లో పన్ను మినహాయింపును రూ.2 లక్షలకు పరిమితం చేశారు. కనుక ఇంతకంటే ఎక్కువ మొత్తంలో పన్ను ప్రయోజనం ఉండదు కాబట్టి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, డెట్‌ ఫండ్స్‌లో పెట్టే కంటే ఇంటి రుణం తీర్చేందుకు అదనంగా కేటాయించుకోవడం నయం. 

అనారోగ్యానికి కవరేజీ ఉండాలి
మీరు తీసుకున్న వైద్య బీమా పాలసీ అన్ని రకాల రిస్క్‌లను కవర్‌ చేస్తుందనుకుంటున్నారా..? ఒక్కసారి పరిశీలించుకోండి. ఎందుకంటే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడితే హాస్పిటల్‌లో చేరి 30 రోజులకు పైగా చికిత్స తీసుకోవాల్సిన సందర్భమే వస్తే అప్పుడు సాధారణ బీమా పాలసీలు అక్కరకు రావు. ఎందుకంటే ఈ పాలసీల్లో కవరేజీ పరిమితంగా ఉండడమే కాకుండా, హాస్పిటల్‌లో గరిష్టంగా 30రోజులకే కవరేజీ లభిస్తుంది. ఆరోగ్య సంరక్షణ వ్యయాలు ఏటేటా భారీగా పెరిగిపోతున్నాయి. కనుక బేసిక్‌ ప్లాన్‌కు అదనంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ కూడా ఉండాలని సూచిస్తున్నారు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఈడీ ముకేశ్‌కుమార్‌. జీవిత బీమా లేదా వైద్య బీమాకు రైడర్‌గానూ లేదా స్టాండలోన్‌గా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ ప్లాన్‌ను తీసుకునే వెసులుబాటు ఉంది.

గోల్డ్‌ ఫండ్స్‌ వద్దు
బంగారం ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ను (ఈటీఎఫ్‌) బంగారంలో పెట్టుబడులకు అనువైన సాధనంగా గతంలో పరిగణించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి తల్లకిందులయింది. వీటి కంటే సార్వభౌమ బంగారం బాండ్లు అధిక రాబడులనిస్తున్నాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు వార్షికంగా 1 శాతాన్ని ఎక్స్‌పెన్స్‌ రేషియోగా వసూలు చేస్తున్నాయి. అదే బంగారం బాండ్లు ఎక్స్‌పెన్స్‌ ఛార్జీలవంటివేమీ లేకుండా... వార్షికంగా అవే 2.5 శాతం వడ్డీని ఇస్తున్నాయి. ఇక బంగారం ధర పెరుగుదల ప్రయోజనం ఎలాగూ లభిస్తుంది. దీంతో బంగారం ఈటీఎఫ్‌ల కంటే బంగారం బాండ్లు వార్షికంగా 3.5 శాతం అధికంగా రాబడులను ఇస్తున్నట్టు లెక్క. 

వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయొద్దు
ఇటీవల బిట్‌కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీల్లో చోటు చేసుకున్న పతనం ఇన్వెస్టర్లకు ఓ మేల్కొలుపుగా నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు బిట్‌కాయిన్‌కు దూరంగా ఉండాలని, వారికి ఏ ధరలో కొనాలి, ఎక్కడ విక్రయించాలో తెలియకపోవడం పెద్ద రిస్క్‌ అని కోటక్‌ మహింద్రా మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ నీలేష్‌ షా చెప్పారు.

అద్దెకు తీసుకుంటే పోలే...
ఇటీవల కాలంలో ఇంటికి కావాల్సిన ఉత్పత్తులు అద్దెకు తీసుకునే ధోరణి పెరుగుతోంది. ఇది ఖర్చు పరంగా సౌకర్యమైనది. ఎందుకంటే ఒకే నగరం, పట్టణం పరిధిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం సాధారణం అయిపోతోంది. ముఖ్యంగా యువ నిపుణులకు ఇది ఎక్కువగా అనుభవం. దీంతో ఫర్నిచర్‌ను అద్దెకు తీసుకుంటున్న వారున్నారు. ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలను అద్దెకు తీసుకునేందుకు నెలకు రూ.10 వేల బడ్జెట్‌ చాలు. అద్దెకు తీసుకుంటే అందులోనే ఉచితంగా డెలివరీ చేస్తారు. వేరే ప్రాంతానికి మారినా ఉచితంగానే రవాణా చేస్తారు. శుభ్రం చేయడం, నిర్వహణ కూడా అద్దెకు ఇచ్చిన సంస్థల పనే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement