కాబూల్ : రోజువారి జీవితంలో మనలో చాలా మంది.. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతుంటారు. ఆత్మహత్య లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటుంటారు. నిజమైన కష్టాలను చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కొంటున్న వారిని చూసినప్పుడు.. మనకు అర్థం అవుతుంది. అసలు కష్టం అంటే ఎలా ఉంటుందో. వారి ధైర్యం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ కోవకు చెందినవాడే అఫ్గనిస్తాన్‌కు చెందిన అహ్మద్ సయ్యద్ రహ్మాన్ అనే ఈ చిన్నారి. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవ్వడమే కాక ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఎందుకో మీరు తెలుసుకొండి.
అఫ్గనిస్తాన్.. తాలిబన్లకు, సాయుధబలగాలకు మధ్య నలిగిపోతున్న దేశం. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దాడి జరుగుతుందో తెలీక ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతుంటారు. నిత్యం ఏదో చోట మారణహోమం జరుగుతూనే ఉంటుంది. ఎందరినో బలి తీసుకుంటుంది. ఎనిమిది నెలల పసివాడుగా ఉన్నప్పుడు అహ్మద్‌పై ఈ పైశాచిక దాడి పంజా విసిరింది. అహ్మద్ గ్రామంలో తాలిబన్లకు, సాయుధ బలగాలకు మధ్య జరిగిన దాడిలో ఆ చిన్నారి కాలుకు బుల్లెట్ గాయం చేసింది. దాంతో అతడి కుడి కాలును పూర్తిగా తొలగించారు వైద్యులు. అప్పటి నుంచి అహ్మద్ కృత్రిమ కాలు మీదనే ఆధారపడుతున్నాడు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం అహ్మద్‌కు మరోసారి కృత్రిమ కాలు అమర్చారు. దాని తర్వాత ఆ చిన్నారి సంతోషం చూడాలి. తనకు కృత్రిమ కాలు అమర్చగానే.. ఆనందంతో డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు అహ్మద్. రోయా ముసావి అనే ట్విటర్ యూజర్ అహ్మద్ డ్యాన్స్ చేస్తోన్న వీడియోని షేర్ చేశారు. ‘కృత్రిమ కాలు అమర్చగానే తన సంతోషాన్ని ఇలా డ్యాన్స్ ద్వారా తెలియజేశాడు. చిన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదం ఇతని జీవితాన్ని మార్చడమే కాక ఎల్లప్పుడు నవ్వుతూ ఉండటం ఎలానో నేర్పించిందం’టూ ట్వీట్ చేశారు.
Ahmad received artificial limb in @ICRC_af Orthopedic center, he shows his emotion with dance after getting limbs. He come from Logar and lost his leg in a landmine. This is how his life changed and made him smile. pic.twitter.com/Sg7jJbUD2V
— Roya Musawi (@roya_musawi) May 6, 2019
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడమే కాక నెటిజన్ల ప్రశంసలు కూడా అందుకుంది. ‘అతని కళ్లలో నిజమైన సంతోషం కనిపిస్తుంది’.. ‘దైనందిన జీవితంలో పడి నిజమైన సమస్యలతో బాధపడే మనుషుల గురించి పెద్దగా పట్టించుకోం. ఇతని సంతోషాన్ని, బాధను దేనితో కూడా పోల్చలేం. నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment