వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు బాసటగా నిలిచిందని అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం హిల్లరీ తనకంటే లక్షలాది డాలర్లు అధికంగా వెచ్చించారని ఆరోపించారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ తనను కాదని హిల్లరీనే సపోర్ట్ చేసిందని చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యాకు చెందిన హ్యాకర్లు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకున్నారనే వార్తల నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా ట్వీట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ట్రంప్ ప్రచారం, రష్యన్ సంస్థల మధ్య నెలకొన్న వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. రష్యా కేంద్రంగా సాగిన ఫేస్‌బుక్ ప్రచారం కంటే సీఎన్‌ఎన్,ఏబీసీ, ఎన్‌బీసీ, సీబీఎస్ ఛానెల్స్‌లో హిల్లరీకి అనుకూలంగా సాగిన ప్రచారం మాటేమిటని ట్రంప్ తన ట్వీట్‌లో నిలదీశారు. ఆయా ఛానెళ్లలో జరిగిన ఫేక్ న్యూస్ వ్యాప్తికి వందల కోట్ల డాలర్లు కుమ్మరించారని వాటి సంగతి నిగ్గుతేల్చాలని ట్రంప్ పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని ట్రంప్ న్యాయ శాఖను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment