ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించి చరిత్ర సృష్టించిన భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ- పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌ల వివాహం డిసెంబరు 12న వైభవోపేతంగా జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచిన ఈ శుభకార్యం జరిగి రెండు వారాలు గడిచినా.. అందుకు సంబంధించిన విశేషాలు, వీడియోలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. తమ గారాల పట్టి, ఇంటి ఒక్కగానొక్క ఆడపడుచు అప్పగింతల సమయంలో ముఖేష్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురైన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివాహానంతరం కుమార్తెను దేవుడి గదిలోకి తీసుకువెళ్లిన అంబానీ దంపతులు ఇషాను ప్రేమగా హత్తుకుని భర్త చేతిలో పెట్టారు. ఆ తర్వాత ఇంటి సంప్రదాయం ప్రకారం ఇషా ధాన్యం వెనక్కి జల్లుతూ తల్లిదండ్రులతో కలిసి కారు వద్దకు నడిచిరాగా... సోదరులు ఆకాశ్(కవల సోదరుడు), అనంత్‌లు, నానమ్మ కోకిలాబెన్ కూడా ఇషాను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలికారు. ఆ సమయంలో ముఖేష్ కన్నీళ్లు పెట్టుకుంటూ కూతురిని సాగనంపిన దృశ్యం ప్రతీ ఒక్కరిని హత్తుకుంటోంది.
కాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయినా అపర కుబేరుడు అయితేనేం ముఖేష్ అంబానీ కూడా ఓ ఆడపిల్ల తండ్రే కదా. ఇన్నాళ్లు అపురూపంగా పెంచుకున్న తన కూతురుని మెట్టింటికి పంపిస్తున్నపుడు ఆమాత్రం ఉద్వేగానికి గురవడం సహజమే. ఈ విషయంలో సగటు భారతీయ తండ్రికి తానేమీ అతీతుడిని కాదని నిరూపించుకున్నారు అంబానీ. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు... ‘ ఎంత ధనవంతులైనా కుటుంబ సంప్రదాయాలను తూచా తప్పకుండ పాటించిన అంబానీ కుటుంబం చాలా గొప్పది. నిజంగా వధువు తరఫు వారికి ఇది చాలా భావోద్వేగమైన సమయం’ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment