
మిస్సిసిపి: కుక్కపిల్ల ఎదురు చూస్తోంది.. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాదు..! తన యజమాని వస్తారని, తనతోపాటు తీసుకెళ్తారని..! ఆహార అన్వేషణను కూడా మానేసి ఉన్నచోటులోనే కదలకుండా ఉండిపోయింది. ఈ హృదయ విదారకమైన ఘటన మిస్సిసిపీలోని బ్రూక్‌హావెన్‌లో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తనకు అవసరం లేదని భావించిన కుర్చీ, టీవీలను రోడ్డు పక్కన పాడేశాడు. ప్రాణం లేని వస్తువులతో పాటు అతను పెంచుకుంటున్న కుక్కపిల్లను సైతం కుర్చీలో వదిలేసి వెళ్లిపోయాడు.
ఈ విషయాన్ని గుర్తించిన జంతు నియంత్రణ అధికారిని శారన్ నార్టన్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా అనతికాలంలోనే వైరల్‌గా మారింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానిని ఉద్దేశించి.. ‘కుక్కపిల్ల కుర్చీని వదలటానికి కూడా భయపడుతోంది. మీరు తిరిగి వస్తారేమోనని వేచి చూస్తూ తిండి కూడా మానేసి కుర్చీనంటిపెట్టుకుని కూర్చుంది. ఇలాగైతే ఆ కుక్కపిల్ల ఆకలితో అలమటిస్తూ.. చిక్కి శల్యమై చనిపోతుంది. దాన్ని అలా రోడ్డుపై వదిలేసి వెళ్లినందుకు సిగ్గనిపించట్లేదా..?’ అంటూ నార్టన్ పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా శునకాన్ని వదిలేసిన యజమానిపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ఎంతో దీనంగా చూస్తున్న కుక్కపిల్ల ఫోటోలను చూసి సోషల్ మీడియా చలించిపోయింది. మూగజీవిని రోడ్డు పక్కన పాడేయడానికి మనసెలా వచ్చిందంటూ జంతు ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. దానికున్న విశ్వాసంలో కొంతభాగమైనా ఆ యజమానికుంటే బాగుండేది అంటూ అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment