తమిళసినిమా: నేను నా హద్దుల్లోనే ఉన్నానని అంటోంది నటి సాయిపల్లవి. అదృష్టం తేనె తుట్టెలా పట్టిన యువ నటీమణుల్లో ఈ భామ ఒకరు. మాలీవుడ్‌లో ప్రేమమ్ చిత్రంతో మలర్ (పుష్పం)లా వికసించిన నటి సాయిపల్లవి. ఆ చిత్రం ఈమెను దక్షిణాదంతా వ్యాప్తి చెందేలా చేసింది. ఇక టాలీవుడ్‌లో ఫిదా చిత్ర విజయంతో పరుగులు తీసిన ఈ జాణ మార్కెట్ ఎంసీఏ చిత్రంతో మరింత బలపడింది. ప్రస్తుతం శర్వానంద్‌తో నటిస్తున్న తెలుగు చిత్రానికి సాయిపల్లవి కోటి రూపాయలు పారితోషికం పుచ్చుకున్నట్లు ప్రచారం హల్‌చల్ చేస్తోంది. ఇలా రెండు చిత్రాలతో అంద పెద్ద మొత్తం పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిన నటి సాయిపల్లవినే అవుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం కరు ఇంకా తెరపైకి రానేలేదు.
మరో రెండు చిత్రాల్లో నటించేస్తోంది. అందులో ఒకటి సూర్యతో జత కడుతున్న ఎన్‌జీకే. రెండోది ధనుష్‌తో రొమాన్స్ చేస్తున్న మారి–2. ఈ రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. సినిమాలో తనకుంటూ ఒక బాణీని ఏర్పరచుకుని దూసుకుపోతున్న సాయిపల్లవి మాట్లాడుతూ అవకాశాలు చాలానే వస్తున్నాయని, అయితే అన్నీ కమిట్ అవకుండా తనకు నప్పే పాత్రలనే అంగీకరిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ అమ్మడిపై విమర్శలు ఎక్కువే ప్రచారం అవుతున్నాయి. అలాంటివేవీ పట్టించుకోనని, తాను ఏ ఇతర నటీమణులకు పోటీ కానని చెప్పుకొచ్చింది. తన బలం,బలహీనం ఏమిటన్నది తనకు బాగా తెలుసని, అందుకే తన హద్దుల్లోనే తాను ఉన్నానని అంది. అన్ని రకాల పాత్రలకు తాను నప్పనన్న విషయం తనకు తెలుసని అందుకే పాత్రల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని సాయిపల్లవి పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment