
భువనేశ్వర్: అగ్ర తారల తళుకులు... బాణా సంచా మెరుపులు... రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులు... హుషారెత్తించే పాటలు... మైమరపించే నృత్య ప్రదర్శనల మధ్య... మనుషులంతా ఒక్కటే అని చాటుతూ... 14వ పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఆతిథ్య రాష్ట్రం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో, 16 ప్రాతినిధ్య దేశాల కెప్టెన్ల హాజరీలో జరిగిన ఈ కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, అందాల తార మాధురీ దీక్షిత్, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రదర్శనలు కట్టిపడేశాయి. మాధురీ భూ దేవీగా అవతరిస్తూ, ప్రపంచ ప్రజలందరినీ తన పిల్లలుగా సంబోధిస్తూ చేసిన ప్రసంగంతో షో ప్రారంభమైంది.
ఆమెపై చిత్రీకరించిన ‘ఎర్త్ సాంగ్’ అలరించింది. 1100 మంది కళాకారులతో, షిమాక్ దావర్ కొరియోగ్రఫీలో రూపొందిన ‘ఫ్యూజన్ డ్యాన్స్’ అబ్బురపర్చింది. గుల్జార్ రచించిన ప్రపంచ కప్ అధికార పాట ‘జై హింద్, జై ఇండియా’కు రెహమాన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ మరింత వన్నె తెచ్చింది. ‘డ్రమ్స్’ శివమణి తన వాయిద్యాలతో హోరెత్తించారు. మరోవైపు ప్రపంచకప్‌లో పాల్గొంటున్న జట్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాభిమానులను ఈ కప్ అలరిస్తుందని, భారత దేశ, ప్రత్యేకించి ఒడిశా సంస్కృతిని ప్రపంచానికి చాటుతుందున్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment