న్యూఢిల్లీ: ఒకే క్రీడకు చెందిన ఆటగాళ్లు పెద్దసంఖ్యలో డోపీలుగా తేలడం... వారంతా మైనర్లు కావడం భారత క్రీడారంగంలో కలకలం రేపింది. ఏకంగా 22 మంది జూనియర్ రోయర్లు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరీక్షల్లో తేలింది. వీరిలో చాలా మంది ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌లో పాల్గొన్న వారే కావడం గమనార్హం. పోటీలు లేని సమయంలో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు వీరి నుంచి సేకరించిన నమూనాల్లో అంతా ఒకే రకమైన నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా జూనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్ కోసం అప్పుడు వీరంతా హైదరాబాద్ శిబిరంలో శిక్షణ తీసుకుంటున్నారు. 2005లో ‘నాడా’ మొదలయ్యాక ఇలా ఒకే ఆటకు చెందిన ఇంత మంది పట్టుబడటం ఇదే తొలిసారి.]
వీరంతా 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు (మైనర్లు) వారే కావడంతో నిబంధనల ప్రకారం రోయర్ల పేర్లు వెల్లడించడం లేదు. దీనిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ‘నాడా’ సిద్ధమైంది. జాతీయ డోప్ టెస్టింగ్ లాబోరేటరీపై నిషేధం ఉండటంతో ‘నాడా’... దోహా లాబోరేటరీలో నమూనాల్ని పరీక్షించింది. ఇందులో జూనియర్ రోయర్లంతా ఒకే రకమైన ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత రోయింగ్ సమాఖ్య (ఆర్‌ఎఫ్‌ఐ) విచారణ చేపట్టనుంది. బహుశా రోయర్లు తీసుకున్న ఆహార పదార్థాలే కారణం కావొచ్చని ఆర్‌ఎఫ్‌ఐ ప్రాథమికంగా భావిస్తోంది. తదుపరి దర్యాప్తులోనే ఈ విషయాలు వెల్లడవుతాయని ఆర్‌ఎఫ్‌ఐ కార్యదర్శి శ్రీరామ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment