వ్యూహం మార్చి అదరగొట్టారు | 2nd ODI India Beat Australia By 36 Runs | Sakshi
Sakshi News home page

రెండో వన్డేలో భారత్‌ విజయం

Published Sat, Jan 18 2020 3:48 AM | Last Updated on Sat, Jan 18 2020 9:18 AM

2nd ODI India Beat Australia By 36 Runs - Sakshi

భారత జట్టు వ్యూహం మారింది. మ్యాచ్‌ ఫలితం కూడా మారింది. తొలి బంతి నుంచే ధాటిగా ఆడి భారీ స్కోరు సాధించిన టీమిండియా విజయంతో కంగారూలకు జవాబిచ్చింది. ధావన్‌ దూకుడైన ఆరంభాన్ని ఇస్తే కోహ్లి దానిని కొనసాగించాడు. చివర్లో రాహుల్‌ మెరుపు దాడితో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం నిలిచింది. ముంబై మ్యాచ్‌ తరహా ప్రమాదం ఎదురు కాకుండా ఓపెనర్లను భారత్‌ కట్టడి చేయడంతో ఆసీస్‌కు ఛేదన కష్టంగా మారిపోయింది. స్టీవ్‌ స్మిత్‌ ఒంటరి పోరాటం చేసినా అది సరిపోలేదు. ఐదుగురు బౌలర్లూ వికెట్లు తీసి సమష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియాకు కంగారు తప్పలేదు. ఇరు జట్లు సమంగా నిలిచిన స్థితిలో ఇక ఆదివారం జరిగే పోరుతో సిరీస్‌ విజేత ఎవరో  తేలనుంది.   

రాజ్‌కోట్‌: తొలి వన్డే పరాజయం నుంచి భారత్‌ వెంటనే కోలుకుంది. సిరీస్‌ చేజార్చుకునే ప్రమాదం ఎదురు కాకుండా సరైన రీతిలో స్పందించి 1–1తో పోరును సమం చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్‌ 36 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (90 బంతుల్లో 96; 13 ఫోర్లు, 1 సిక్స్‌) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేఎల్‌ రాహుల్‌ (52 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (76 బంతుల్లో 78; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆడమ్‌ జంపా 3 వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్‌ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (102 బంతుల్లో 98; 9 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా సెంచరీ అవకాశం కోల్పోగా, లబ్‌షేన్‌ (47 బంతుల్లో 46; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ప్రభావం చూపలేకపోవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం బెంగళూరులో జరుగుతుంది.  
(చదవండి : కుల్దీప్‌ @ సెంచరీ)

సెంచరీ మిస్‌...
కమిన్స్‌ వేసిన తొలి ఓవర్‌ మెయిడిన్‌గా ముగియగా, ధావన్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతిని ఫోర్‌గా మలచి బోణీ చేశాడు. ఆ తర్వాత రోహిత్‌ శర్మ (44 బంతుల్లో 42; 6 ఫోర్లు) కూడా కొన్ని చక్కటి ఫ్లిక్‌లు, డ్రైవ్‌లు ఆడటంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. వీరిద్దరి భాగస్వామ్యం శతకానికి చేరువవుతున్న తరుణంలో జంపా బౌలింగ్‌లో రోహిత్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. అతను రివ్యూ కోరినా లాభం లేకపోయింది. ఎప్పటిలాగే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి తనదైన శైలిలో చకచకా పరుగులు సాధించాడు. అనంతరం 60 బంతుల్లో ధావన్‌ వరుసగా రెండో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అతని దూకుడు మరింత పెరిగింది. అగర్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ధావన్‌ అతని తర్వాతి ఓవర్లో వరుసగా 6, 4 బాదాడు. అయితే కోహ్లితో సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేయగానే దురదృష్టవశాత్తూ వెనుదిరిగాడు. అయ్యర్‌ (7) మరో సారి విఫలమయ్యాడు.  
(చదవండి : ఇది మనీష్‌ పాండే వికెట్‌!)

రాహుల్‌ జోరు...
ఐదో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్‌ ఈసారి మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ బాధ్యతను కూడా సమర్థంగా నిర్వర్తించాడు. చూడచక్కటి షాట్లతో అతను మరో ఎండ్‌లో ఉన్న కోహ్లికంటే వేగంగా, ఎక్కువగా పరుగులు రాబట్టడం విశేషం. సరిగ్గా 50 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి ఇన్నింగ్స్‌లో... కమిన్స్‌ ఓవర్లో కొట్టిన రెండు వరుస ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. అయితే బౌండరీ వద్ద అగర్‌–స్టార్క్‌ ర్యాలీ క్యాచ్‌ భారత కెపె్టన్‌ ఆటను ముగించింది. 78 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యంలో రాహుల్‌ 42 పరుగులు చేయగా, కోహ్లి 36 పరుగులు సాధించాడు. పంత్‌కు బదులుగా ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న మనీశ్‌ పాండే (2) ఎక్కువ సేపు నిలవలేదు. అయితే రాహుల్‌ బ్యాటింగ్‌ ఒక్కసారిగా కథ మార్చేసింది. స్టార్క్‌ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టిన రాహుల్‌... కమిన్స్‌ ఓవర్లోనూ ఇదే తరహాలో వరుసగా 6, 4తో చెలరేగాడు. చివరి ఓవర్లో స్ట్రైకింగ్‌ కోసం ప్రయత్నిస్తూ రాహుల్‌ రనౌటయ్యాడు.  

10 ఓవర్లలో 91 పరుగులు...

40 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 249/3. అయితే ఆ తర్వాత విరుచుకుపడిన టీమిండియా చివరి పది ఓవర్లలో ఏకంగా 91 పరుగులు సాధించడం విశేషం. 41–45 ఓవర్ల మధ్య 38 పరుగులు రాగా, తర్వాతి 4 ఓవర్లలో 15, 8, 11, 14 చొప్పున పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌ వేసిన స్టార్క్‌ 5 పరుగులే ఇచ్చే కొంత నష్ట నివారణకు ప్రయత్నించాడు.  

స్మిత్‌ ఒంటరిపోరు...
గత మ్యాచ్‌ తరహాలో ఆస్ట్రేలియాకు ఈసారి ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. కవర్స్‌లో మనీశ్‌ పాండే సూపర్‌ క్యాచ్‌కు వార్నర్‌ (15) వెనుదిరగడంతో ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఫించ్‌ (33; 3 ఫోర్లు), స్మిత్‌ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే రాహుల్‌ అద్భుతమైన కీపింగ్‌ నైపుణ్యం ఫించ్‌ స్టంపౌట్‌కు కారణమైంది. ఈ దశలో స్మిత్‌కు కెరీర్‌లో తొలి వన్డే ఇన్నింగ్స్‌ ఆడుతున్న లబ్‌షేన్‌ జత కలిశాడు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బంతికో పరుగు చొప్పున రాబడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 47 బంతుల్లోనే స్మిత్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ భాగస్వామ్యం సాగినంత సేపు ఆసీస్‌కు విజయావకాశాలు కనిపించాయి. అయితే లబ్‌షేన్‌ను జడేజా వెనక్కి పంపడంతో ఆసీస్‌ పతనం ప్రారంభమైంది. 38వ ఓవర్లో ముందుగా క్యారీ (18)ని కుల్దీప్‌ అవుట్‌ చేయగా, ఐదో బంతిని వికెట్లపైకి ఆడుకొని సెంచరీ ముంగిట స్మిత్‌ నిరాశగా వెనుదిరిగాడు. అంతే... ఆ తర్వాత కంగారూల పరాజయం లాంఛనమే అయింది.  

ధావన్‌కు గాయం
భారత ఓపెనర్‌ ధావన్‌ స్వల్ప గాయానికి గురయ్యాడు. దాంతో ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి దిగలేదు. ఇన్నింగ్స్‌ 10వ ఓవర్లో కమిన్స్‌ విసిరిన బంతి నేరుగా అతని కుడి వైపు పక్కటెముకల్లో బలంగా తాకింది. ఆ బంతికి సింగిల్‌ పూర్తి చేసుకున్న ధావన్‌ చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే బెదరకుండా క్రీజ్‌లోనే నిలిచి ఆటను కొనసాగించిన అతను తన స్కోరుకు మరో 69 పరుగులు జోడించడం విశేషం. ధావన్‌కు బదులుగా చహల్‌ ఫీల్డింగ్‌ చేశాడు.  

పంత్‌ స్థానంలో భరత్‌ :‘కన్‌కషన్‌’ కారణంగా రెండో వన్డేకు దూరమైన వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ స్థానంలో సెలక్టర్లు మరో ప్రత్యామ్నాయ ఎంపిక చేశారు. రెండో వన్డే కోసం పంత్‌ స్థానంలో ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ను జట్టులోకి తీసుకున్నారు.
   
రోహిత్‌ కూడా:  ఫీల్డింగ్‌లో మరో ఓపెనర్‌ రోహిత్‌ భుజానికి కూడా స్వల్ప గాయమైంది. 43వ ఓవర్లో బౌండరీ వద్ద బంతిని ఆపే క్రమంలో రోహిత్‌ నియంత్రణ కోల్పోయాడు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న అతనికి టీమ్‌ ఫిజియో నితిన్‌ పటేల్‌ చికిత్స అందించిన అనంతరం రోహిత్‌ మైదానం వీడాడు. రోహిత్‌కు కొంత నొప్పి ఉన్నా పగులు మాత్రం రాలేదు కాబట్టి తర్వాతి మ్యాచ్‌కు అతను అందు బాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు కోహ్లి వెల్లడించాడు.   

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) (బి) జంపా 42; ధావన్‌ (సి) స్టార్క్‌ (బి) రిచర్డ్సన్‌ 96; కోహ్లి (సి) స్టార్క్‌ (బి) జంపా 78; అయ్యర్‌ (బి) జంపా 7; రాహుల్‌ (రనౌట్‌) 80; పాండే (సి) అగర్‌ (బి) రిచర్డ్సన్‌ 2; జడేజా (నాటౌట్‌) 20; షమీ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 340.
వికెట్ల పతనం: 1–81; 2–184; 3–198; 4–276; 5–280; 6–338. బౌలింగ్‌: కమిన్స్‌ 10–1–53–0; స్టార్క్‌ 10–0–78–0; రిచర్డ్సన్‌ 10–0–73–2; జంపా 10–0–50–3; అగర్‌ 8–0–63–0; లబ్‌õÙన్‌ 2–0–14–0.  
 ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) పాండే (బి) షమీ 15; ఫించ్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) జడేజా 33; స్మిత్‌ (బి) కుల్దీప్‌ 98; లబ్‌õÙన్‌ (సి) షమీ (బి) జడేజా 46; క్యారీ (సి) కోహ్లి (బి) కుల్దీప్‌ 18; టర్నర్‌ (బి) షమీ 13; అగర్‌ (ఎల్బీ) (బి) సైనీ 25; కమిన్స్‌ (బి) షమీ 0; స్టార్క్‌ (సి) రాహుల్‌ (బి) సైనీ 6; రిచర్డ్సన్‌ (నాటౌట్‌) 24; జంపా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 6; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (49.1 ఓవర్లలో ఆలౌట్‌) 304.  
వికెట్ల పతనం: 1–20; 2–82; 3–178; 4–220; 5–221; 6–259; 7–259; 8–274; 9–275; 10–304.
బౌలింగ్‌: బుమ్రా 9.1–2–32–1; షమీ 10–0–77–3; సైనీ 10–0–62–2; జడేజా 10–0–58–2; కుల్దీప్‌ 10–0–65–2.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement