నేడు భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డే
డర్బన్: తొలి వన్డేలో చిత్తయిన భారత్, ఇప్పుడు ‘పచ్చిక’పై మరో పోరుకు సిద్ధమైంది. ఇక్కడి కింగ్స్‌మీడ్ మైదానంలో ఆదివారం జరిగే రెండో వన్డేలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం 0-1తో వెనుకబడిన ధోని సేన ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలబడే అవకాశాలు ఉంటాయి. అయితే జట్టుకు విజయం అంత సులువు కాబోదు. జొహన్నెస్‌బర్గ్ తరహాలోనే ఇక్కడ కూడా పేస్‌కు అనుకూలించే వికెట్, మేఘావృతమైన వాతావరణం భారత్‌కు సవాల్ విసురుతున్నాయి. ఈ మైదానంలో మన జట్టు ఇప్పటి వరకు ఆరు వన్డేలు ఆడగా ఒక్కటీ గెలవలేకపోయింది. అయిదింట్లో ఓడగా మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఒక్కసారి మాత్రమే మన జట్టు 200 పరుగులు దాటగలిగింది.
మార్పులు ఉంటాయా?
భారత బ్యాట్స్‌మెన్ సత్తాకు ఈ వన్డే మరోసారి పరీక్షగా నిలవనుంది. బౌన్సీ వికెట్‌పై ఆరుగురు పేసర్ల దాడిని టీమిండియా ఎలా ఎదుర్కొంటుందనేది కీలకం. గత మ్యాచ్‌లో కెప్టెన్ ధోని మినహా అందరూ విఫలమయ్యారు. ఆందోళనకు గురి కాకుండా క్రీజ్‌లో నిలబడితే పరుగులు చేయవచ్చని అతను చూపించాడు. అతనికి సహకరించిన రవీంద్ర జడేజా కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే స్వదేశంలో ఆస్ట్రేలియాపై చెలరేగిన రోహిత్ శర్మ తొలి వన్డేలో ఆడిన తీరు జట్టు మానసిక స్థితికి అద్దం పడుతుంది. భారీగా పరుగులు చేయడం సంగతి అలా ఉంచితే బంతికి బ్యాట్ తాకించేందుకు అతను ఆపసోపాలు పడ్డాడు. ఇప్పుడు అతనితో పాటు ధావన్ కూడా స్టెయిన్ చాలెంజ్‌ను దాటి ముందుకు వెళితేనే జట్టుకు మెరుగైన ఆరంభం ఇవ్వగలరు. అందుకు టెక్నిక్‌తో పాటు కొద్ది పాటి ఓపిక కూడా అవసరం. గత మ్యాచ్‌లో భారీ స్కోరు చేయకపోయినా విరాట్ కోహ్లి చక్కటి నియంత్రణతో బ్యాటింగ్ చేశాడు. ఆ ఇన్నింగ్స్ అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనే చెప్పవచ్చు.
వరుసగా విఫలమవుతున్న యువరాజ్ స్థానంలో అజింక్యా రహానేకు అవకాశం లభించవచ్చు. మరోవైపు రైనా ప్రదర్శన కూడా మెరుగు పడాల్సి ఉంది. బౌలింగ్‌లో మాత్రం భారత్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కేవలం స్వింగ్‌పైనే ఆధారపడే భువనేశ్వర్‌ను తప్పించే అవకాశం ఉంది. అతని స్థానంలో వేగంతో బౌలింగ్ చేయగలిగే ఉమేశ్ యాదవ్‌కు స్థానం దక్కవచ్చు. ఇక్కడి పిచ్‌పై ఉమేశ్ ఉపయుక్తమైన బౌలర్ కాగలడు. మరో వైపు ప్రత్యర్థి తరహాలోనే పూర్తిగా పేస్‌ను నమ్ముకోవాలంటే అశ్విన్‌ను కూడా పక్కన పెట్టి నాలుగో పేసర్‌ను ఆడించే ధైర్యం మేనేజ్‌మెంట్ చేయగలదా చూడాలి. మొత్తానికి చావో, రేవో అనిపించే ఈ మ్యాచ్‌లో గెలు పు కోసం భారత్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. మైదానంలో ప్రేక్షకుల అండ మన జట్టుకే లభించవచ్చు.
ఫిలాండర్ చోటు...
మరోవైపు తొలి వన్డేలో భారీ విజయంతో దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇటీవల పాక్ చేతిలో సిరీస్ ఓడిన ఆ జట్టు ఈసారి అలసత్వం దరి చేరకుండా జాగ్రత్త పడుతోంది. అందుకోసం సఫారీలు తమ ఆటతో పాటు అనుకూలమైన పిచ్‌ను కూడా నమ్ముకున్నారు. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలమేమిటో తెలిసింది. ఓపెనర్లు డి కాక్, ఆమ్లాలు నిలకడతో పాటు ధాటిని కొనసాగించారు. కలిస్ ఆకట్టుకోకపోయినా సీనియర్‌గా ఆ జట్టుకు అతని అండ అవసరం.
ఈ ఏడాది డివిలియర్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, డుమిని అతనికి జతగా మరో విధ్వంసానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా మరో హిట్టర్ మిల్లర్ భారత జట్టుపై చెలరేగిపోగలడు. ఆల్‌రౌండర్‌గా మెక్లారెన్, ఫిలాండర్‌లతో చివరి వరకు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గాయంతో తొలి మ్యాచ్ ఆడని ఫిలాండర్ జట్టుతో చేరడం భారత్ కష్టాలను మరింత పెంచనుంది. స్టెయిన్ పదును ఏమిటో భారత్ రుచి చూసింది. ఐదుగురు ప్రధాన పేసర్లతో పాటు కలిస్ కలిస్తే ఆరుగురితో ఆ జట్టు టీమిండియాను చుట్టేయడానికి సిద్ధమైంది. భారత బలహీనత తెలిసిన కెప్టెన్ డివిలియర్స్ మరో సారి పేస్ వ్యూహాన్ని అమలు చేయనున్నాడు.
జట్ల వివరాలు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, యువరాజ్/రహానే, రైనా, జడేజా, అశ్విన్, మోహిత్, షమీ, భువనేశ్వర్/ఉమేశ్.
దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), డి కాక్, ఆమ్లా, కలిస్, డుమిని, మిల్లర్, మెక్లారెన్, ఫిలాండర్, మోర్కెల్, స్టెయిన్, పార్నెల్/సోట్సోబ్.