మళ్ళీ దెబ్బ పడింది | South Africa posted 280 for six against India in their second cricket one-dayer here today | Sakshi
Sakshi News home page

మళ్ళీ దెబ్బ పడింది

Published Mon, Dec 9 2013 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

మళ్ళీ దెబ్బ పడింది

మళ్ళీ దెబ్బ పడింది

డర్బన్:  దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. అన్ని రంగాల్లో విఫలమైన జట్టు వన్డే సిరీస్ కోల్పోయింది. ఆదివారం ఇక్కడి కింగ్స్‌మీడ్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. అనంతరం భారత్ 35.1 ఓవర్లలో  146 పరుగులకే ఆలౌటైంది. సఫారీ ఆటగాళ్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ క్వాంటన్ డి కాక్ (118 బంతుల్లో 106; 9 ఫోర్లు) సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీ చేయగా... హాషిం ఆమ్లా (117 బంతుల్లో 100; 8 ఫోర్లు) కూడా శతకంతో చెలరేగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు ఏకంగా 194 పరుగులు జత చేసి తమ జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరఫున రైనా (50 బంతుల్లో 36; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. సోట్సోబ్ (4/25) జట్టును దెబ్బ తీశాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను డివిలియర్స్ బృందం 2-0తో గెలుచుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం సెంచూరియన్‌లో జరుగుతుంది.
 మళ్లీ ఆ ఇద్దరే...
 అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆట గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో మ్యాచ్‌ను 49 ఓవర్లుగా కుదించారు. టాస్ గెలిచిన ధోని మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. భువనేశ్వర్, మోహిత్‌ల స్థానంలో ఇషాంత్, ఉమేశ్‌లకు అవకాశం ఇవ్వగా... అనారోగ్యంతో ఉన్న యువరాజ్ స్థానంలో రహానేకు చోటు దక్కింది. దక్షిణాఫ్రికా జట్టులో పార్నెల్ స్థానంలో ఫిలాండర్‌ను ఎంపిక చేశారు.  
 ప్రొటీస్ ఓపెనర్లు డి కాక్, ఆమ్లా భారత్‌కు గత మ్యాచ్ ‘రీప్లే’ చూపించారు. అదే తరహాలో ఆరంభం నుంచి చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా సాధికారికంగా ఆడారు. చిన్న స్పెల్స్‌తో పదే పదే బౌలర్లను మార్చిన ధోని వ్యూహం పని చేయకపోగా... ఏ బౌలర్ కూడా ప్రభావం చూపించలేకపోయాడు. దాంతో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు 18.3 ఓవర్లలో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. ఆ తర్వాత కూడా ఈ జోడి జోరు తగ్గలేదు. ఇషాంత్ బౌలింగ్‌లో సింగిల్ తీసి డి కాక్ 112 బంతుల్లో వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భాగస్వామ్యం 200 పరుగులకు చేరువైన తరుణంలో ఎట్టకేలకు భారత్‌కు తొలి వికెట్ దక్కింది. అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి డి కాక్ వెనుదిరిగాడు. గత మ్యాచ్ తరహాలోనే భారీ హిట్టింగ్ చేసే ప్రయత్నంలో మూడో స్థానంలో దిగిన డివిలియర్స్ (3) ఎత్తుగడ పని చేయలేదు. జడేజా చక్కటి బంతిని షాట్ ఆడలేక వెనుదిరిగాడు.
 కట్టడి చేసిన బౌలర్లు....
 194/1తో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికా గత మ్యాచ్ తరహాలోనే 300కు పైగా పరుగుల భారీ స్కోరు చేసేట్లు కనిపించింది. అయితే భారత బౌలర్లు చక్కటి బౌలింగ్‌తో పరుగులు రాకుండా నిరోధించారు. ముఖ్యంగా జడేజా, షమీ కట్టడి చేశారు. 35 నుంచి 48 ఓవర్ల మధ్య ఆ జట్టు 66 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఓపిగ్గా ఆడిన ఆమ్లా కూడా కెరీర్‌లో 12వ సెంచరీని అందుకున్నాడు. ఆ వెంటనే ఒకే ఓవర్లో ఆమ్లా, మిల్లర్ (0)లను షమీ పెవిలియన్ పంపించాడు. డుమిని (29 బంతుల్లో 26; 2 ఫోర్లు) రనౌట్ కాగా, కలిస్ (10) మళ్లీ విఫలమయ్యాడు. ఉమేశ్ వేసిన చివరి ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 20 పరుగులు వచ్చాయి.
 టప టపా...
 రోహిత్ శర్మ (26 బంతుల్లో 19; 2 ఫోర్లు) గత మ్యాచ్ తరహాలో కాకుండా ఈ సారి స్టెయిన్‌ను మెరుగ్గా ఎదుర్కొన్నాడు. అయితే మరోవైపు స్టెయిన్ బౌలింగ్‌లో తాను ఆడిన రెండో బంతికే షాట్ ఆడబోయి ధావన్ (0) వెనుదిరిగాడు. ఈ సారి సోట్సోబ్ వంతు. చక్కటి బంతితో కోహ్లి (0)ని వెనక్కి పంపిన అతను... మరో రెండు ఓవర్ల తర్వాత రోహిత్ శర్మను అవుట్ చేశాడు. షార్ట్ మిడ్ వికెట్‌లో ఆమ్లా అద్భుత క్యాచ్ పట్టడంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత ఓవర్లో దురదృష్టవశాత్తూ రహానే (8) అవుటయ్యాడు. మోర్కెల్ బౌలింగ్‌లో దూరంగా వెళుతున్న బంతిని వేటాడగా, అది కీపర్ చేతిలో పడింది. రీప్లేలో బంతి, బ్యాట్‌కు తాకలేదని కనిపించింది. ఈ దశలో ధోని (31 బంతుల్లో 19), రైనా కలిసి కొద్ది సేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కు 40 పరుగులు జత చేసిన అనంతరం డి కాక్ అద్భుత క్యాచ్‌కు కెప్టెన్ నిష్ర్కమించాడు. ఆ వెంటనే రైనా కూడా పెవిలియన్ చేరాడు. జడేజా (34 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొద్ది సేపు నిలబడ్డా లాభం లేకపోయింది. మరో 13.5 ఓవర్లు ఉండగానే ఇండియా ఇన్నింగ్స్ ముగియడం పరిస్థితిని సూచిస్తోంది.
 స్కోరు వివరాలు
 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 106; ఆమ్లా (సి) ధోని (బి) షమీ 100; డివిలియర్స్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 3; డుమిని (రనౌట్) 26; మిల్లర్ (ఎల్బీ) (బి) షమీ 0; కలిస్ (బి) షమీ 10; మెక్లారెన్ (నాటౌట్) 12; ఫిలాండర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బై 2, వైడ్ 6) 9; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 280.
 వికెట్ల పతనం: 1-194; 2-199; 3-233; 4-234; 5-249; 6-255.
 బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 6-0-45-0; షమీ 8-0-48-3; ఇషాంత్ 7-0-38-0; అశ్విన్ 9-0-48-1; రైనా 6-0-32-0; కోహ్లి 3-0-17-0; జడేజా 10-0-49-1.
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఆమ్లా (బి) సోట్సోబ్ 19; ధావన్ (సి) డుమిని (బి) స్టెయిన్ 0; కోహ్లి (సి) డి కాక్ (బి) సోట్సోబ్ 0; రహానే (సి) డి కాక్ (బి) మోర్కెల్ 8; రైనా (సి) మిల్లర్ (బి) మోర్కెల్ 36; ధోని (సి) డి కాక్ (బి) ఫిలాండర్ 9; జడేజా (సి) డివిలియర్స్ (బి) సోట్సోబ్ 26 ; అశ్విన్ (సి) డి కాక్ (బి) స్టెయిన్ 15 ; షమీ (బి) సోట్సోబ్ 8 ; ఉమేశ్ యాదవ్ (బి) స్టెయిన్ 1 ; ఇషాంత్ (నాటౌట్) 0 ; ఎక్స్‌ట్రాలు (బై 4, లెగ్‌బై 1, వైడ్ 8, నోబాల్ 1) 14 ; మొత్తం (35.1 ఓవర్లలో ఆలౌట్) 146.
 వికెట్ల పతనం: 1-10; 2-16; 3-29; 4-34 ; 5-74 ; 6-95 ; 7-133 ; 8-145 ; 9-146 ; 10-146.
 బౌలింగ్: స్టెయిన్ 7-1-17-3; సోట్సోబ్ 7.1-0-25-4; మోర్కెల్ 6-0-34-2; ఫిలాండర్ 6-1-20-1 ; డుమిని 5-0-20-0 ; మెక్లారెన్ 4-0-25-0. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement