భారత్ అద్భుత విజయం కోసం మరో రోజు నిరీక్షణ తప్పదు. అసాధారణ పోరాట పటిమ కనబర్చిన ఇంగ్లండ్... ఓటమికి చేరువై కూడా పట్టుదలగా నిలబడింది. ఫలితంగా 9 వికెట్ల వద్ద ఆ జట్టు నాలుగో రోజు ఆట ముగించింది. మూడు అదనపు ఓవర్ల సమయంలో టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఆఖరి వికెట్ దక్కలేదు. బుధవారం వాతావరణం కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నా ఒక చక్కటి బంతి మ్యాచ్ చివరి రోజు భారత్‌కు గెలుపు అందించవచ్చు. తొలి సెషన్‌లోనే నాలుగు వికెట్లు... ఇక మన విజయానికి ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే బట్లర్, స్టోక్స్ అద్భుత భాగస్వామ్యం ఇంగ్లండ్‌ను నడిపించింది. వీరిద్దరు ఏకంగా 57.2 ఓవర్ల పాటు ఆడటంతో భారత శిబిరంలో ఆందోళన పెరిగింది. అయితే అప్పుడొచ్చాడు జస్‌ప్రీత్ బుమ్రా... కెరీర్‌లో తొలి సెంచరీ సాధించి ఊపు మీదున్న బట్లర్‌ను ఔట్ చేసి గెలుపు గేట్లు తెరిచాడు. అదే జోరులో అతను మరో మూడు వికెట్లు తీయడంతో మ్యాచ్ సీన్ మారిపోయింది.
నాటింగ్‌హామ్: భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు ఆసక్తికర ముగింపునకు చేరింది. నాలుగో రోజే భారత్ గెలిచేందుకు బాగా చేరువైనా... ఆదిల్ రషీద్ (55 బంతుల్లో 30 బ్యాటింగ్; 5 ఫోర్లు, ఒక సిక్స్) పట్టుదలగా ఆడటంతో మరో రోజు ఆట కొనసాగక తప్పలేదు. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (176 బంతుల్లో 106; 21 ఫోర్లు) శతకంతో చెలరేగగా... బెన్ స్టోక్స్ (187 బంతుల్లో 62; 6 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. జస్‌ప్రీత్ బుమ్రా (5/85) కెరీర్ నాలుగో టెస్టులోనే రెండో సారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో లోకేశ్ రాహుల్ నాలుగు క్యాచ్‌లు పట్టాడు.
ఐదు పరుగుల... ఐదు బంతుల తేడాతో...
ఓవర్‌నైట్ స్కోరు 23/0తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఐదు పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. మంగళవారం మొదటి ఓవర్లోనే జెన్నింగ్స్‌ను (13) ఔట్ చేసిన ఇషాంత్, తన తర్వాతి ఓవర్లో మరో చక్కటి బంతితో కుక్ (17)ను పెవిలియన్‌కు పంపించాడు. జట్టును ఆదుకోవడంలో కెప్టెన్ రూట్ (13), ఒలివర్ పోప్ (16) విఫలమయ్యారు. ఐదు బంతుల తేడాలో ముందుగా రూట్‌ను బుమ్రా ఔట్ చేయగా, షమీ బౌలింగ్‌లో మూడో స్లిప్‌లో కోహ్లి అద్భుత క్యాచ్‌కు పోప్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ వెంటనే వ్యక్తిగత స్కోరు 1 వద్ద బుమ్రా బౌలింగ్‌లో బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను పంత్ వదిలేయడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది.
కీలక భాగస్వామ్యం...
తొలి సెషన్‌లో దాదాపు 10 ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకున్న స్టోక్స్, బట్లర్ లంచ్ తర్వాత కూడా అదే పట్టుదల కనబర్చారు. పరిస్థితికి తగినట్లుగా జాగ్రత్తగా ఆడుతూ, ఎలాంటి తప్పుడు షాట్లకు ప్రయత్నించకుండా సంయమనంతో క్రీజ్‌లో నిలిచారు. భారత పేసర్లు చక్కగా బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం దక్కలేదు. కొన్నిసార్లు ఇంగ్లండ్‌కు అదృష్టం కూడా కలిసొచ్చింది. అశ్విన్ బౌలింగ్‌లో ఒకసారి, షమీ బౌలింగ్‌లో మరోసారి ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌లు బలంగా కనిపించినా... రివ్యూలలో స్టోక్స్ బతికిపోయాడు. మరోవైపు 93 బంతుల్లో బట్లర్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఇంగ్లండ్ రెండో సెషన్‌ను విజయవంతంగా ముగించగలిగింది. టీ తర్వాత కూడా వీరిద్దరూ తమ జోరు కొనసాగిస్తూ మరింత స్వేచ్ఛగా ఆడారు. షమీ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన బట్లర్... ఈ క్రమంలో 152 బంతుల్లోనే కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కొత్త బంతితో...
భారత్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత మూడో ఓవర్లోనే వికెట్ లభించింది. వికెట్ కోసం సుదీర్ఘ సమయం సాగిన నిరీక్షణకు బుమ్రా తెరదించాడు. అతడి బంతిని ఆడకుండా బట్లర్ చేతులెత్తేయగా అది నేరుగా ప్యాడ్లను తాకింది. అంపైర్ ఔట్‌గా ప్రకటించినా బట్లర్ రివ్యూ కోరాడు. అయితే లాభం లేకపోయింది. అద్భుతంగా వేసిన తర్వాతి బంతితో బెయిర్‌స్టో (0)ను క్లీన్‌బౌల్డ్ చేసిన బుమ్రా... తర్వాతి ఓవర్లోనే వోక్స్ (4)ను పెవిలియన్ పంపించాడు. కొద్ది సేపటికి రషీద్‌ను కూడా బుమ్రా ఔట్ చేసినా అది ‘నోబాల్’గా తేలింది. ఈ దశలో దూకుడుగా ఆడిన రషీద్, బ్రాడ్ జోడీ తొమ్మిదో వికెట్‌కు 50 పరుగులు జోడించింది. ఎట్టకేలకు బ్రాడ్‌ను ఔట్ చేసి బుమ్రా ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రషీద్ బలంగా నిలబడటంతో భారత్ నిరాశగా పెవిలియన్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment