కివీస్ ఇన్నింగ్స్ విజయం | 3rd Test: New Zealand beat Pakistan to level series | Sakshi
Sakshi News home page

కివీస్ ఇన్నింగ్స్ విజయం

Published Mon, Dec 1 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

కివీస్ ఇన్నింగ్స్ విజయం

కివీస్ ఇన్నింగ్స్ విజయం

1-1తో సిరీస్ సమం
పాక్‌తో మూడో టెస్టు
అసద్ షఫీఖ్ సెంచరీ వృథా

షార్జా: ఫిలిప్ హ్యూస్ మరణంతో తీవ్ర భావోద్వేగానికి గురైన న్యూజిలాండ్ ఆటగాళ్లు మైదానంలో మాత్రం సత్తా చూపారు. పాకిస్తాన్‌తో జరిగిన చివరిదైన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 80 పరుగుల తేడాతో కివీస్ ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. కివీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 143.1 ఓవర్లలో 690 పరుగులకు ఆలౌటయ్యింది. ఇది ఆ జట్టు టెస్టు చరిత్రలో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓవరాల్‌గా కివీస్ 339 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించగా... రాహత్ అలీ, యాసిర్ షాలకు నాలుగేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన పాక్ జట్టును సీమర్ ట్రెంట్ బౌల్ట్ (4/38), మార్క్ క్రెయిగ్ (3/109) ఇబ్బంది పెట్టారు.

వీరి ధాటికి 63.3 ఓవర్లలో 259 పరుగులకు పాక్ ఆలౌటయ్యింది. అసద్ షఫీఖ్ (148 బంతుల్లో 137; 18 ఫోర్లు; 6 సిక్సర్లు) శతకం సాధించినప్పటికీ మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. ఈ మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన క్రెయిగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం... మహ్మద్ హఫీజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాలు  లభించాయి.  ఈ రెండు జట్ల మధ్య గురువారం నుంచి రెండు టి20 మ్యాచ్‌లు, ఐదు వన్డేల సిరీస్ మొదలవుతుంది. మూడో టెస్టులో మొత్తం 35 సిక్సర్లు నమోదయ్యాయి (ఇందులో కివీస్ నుంచే 22 ఉన్నాయి). టెస్టుల్లో ఇది ప్రపంచ రికార్డు. గతంలో ఇది 27గా ఉంది. అలాగే ఒక ఇన్నింగ్స్‌లో ఆరుగురు కివీస్ బ్యాట్స్‌మెన్ 50కి పైగా పరుగులు సాధించడం కూడా ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement