4 గంటల పాటు... కెప్టెన్ ధోనిని విచారించిన ముద్గల్ కమిటీ
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసును విచారిస్తున్న ముద్గల్ కమిటీ... చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనిని నాలుగు గంటల పాటు విచారించింది. ఈనెల 11న విండీస్‌తో జరిగిన వన్డేకు ముందు రోజు ఈ విచారణ జరిగింది. చెన్నై బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా కూడా దాదాపు 3 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నాడు.
కొంత మంది ఢిల్లీ పోలీసు అధికారుల సమక్షంలో మహీని కమిటీ విచారణాధికారి, నేషనల్ నార్కోటిక్స్ బ్యూరో డిప్యూటీ డెరైక్టర్ బీబీ మిశ్రా ప్రశ్నించారు. వ్యక్తిగత కారణాలు చెప్పి తప్పించుకోకుండా ఉండేందుకు ఈ ఇద్దరికి ముందుగానే కమిటీ సమన్లు జారీ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి వచ్చే నెల 2న ముద్గల్ కమిటీ తన తుది నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయనున్న నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.