కొత్తపేట క్రికెట్‌కు 50 వసంతాలు | 50 years Compleat For Kothapet Cricket Team | Sakshi
Sakshi News home page

కొత్తపేట క్రికెట్‌కు 50 వసంతాలు

Published Mon, Jan 14 2019 1:22 PM | Last Updated on Mon, Jan 14 2019 1:22 PM

50 years Compleat For Kothapet Cricket Team  - Sakshi

1983లో అమలాపురంలో విజయం సాధించిన కొత్తపేట జట్టు (ఫైల్‌)

తూర్పుగోదావరి, కొత్తపేట: కొత్తపేటలో క్రికెట్‌ జట్టు ఏర్పడి, తొలిసారిగా క్రికెట్‌ పోటీలు నిర్వహించి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. రిటైర్డ్‌ వీఆర్‌ఓ సలాది బ్రహ్మానందరావు (మునసబు బాబ్జి), రిటైర్డ్‌ పీఈటీ ముగ్గళ్ల గోపీనాథ్, సీడీ ప్రేమ్‌నాథ్‌ తదితరుల ఆధ్వర్యంలో మొదటి తరం క్రికెట్‌ జట్టు ఏర్పడింది. తద్వారా క్రికెట్‌  పోటీలు ప్రారంభమై, అంచెలంచెలుగా ఇక్కడ రూపుదిద్దుకున్న క్రీడా మైదానం క్రీడా పోటీలకు జిల్లా స్థాయిలోనే ప్రసిద్ధి గాంచింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం విశాలంగా ఉండేది. ఎత్తు పల్లాలు లేకుండా ఈ మైదానం పచ్చని తివాచీ పరిచినట్టుగా ఉండేది. అప్పట్లో ఈ గ్రౌండ్‌ను లండన్‌లోని లార్డ్స్‌ క్రికెట్‌ మైదానంతో పోల్చేవారు.

ఆ బ్యాచ్‌ తరువాతి తరంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్‌ గౌస్, దేశవ్యాప్తంగా స్థిరపడిన విశ్రాంత ఉద్యోగులు, వివిధ హోదాల్లో ఉన్న చిర్రావూరి సత్యనారాయణ (ఐటీడీఏ అధికారి), ఉప్పులూరి కృష్ణమూర్తి (ఐఆర్‌ఎస్‌ అధికారి), విస్సాప్రగడ సూర్యనారాయణమూర్తి (సీఏ), దెందులూరి ప్రసాద్‌ (ఎస్‌బీఐ ఏజీఎం), కోటిపల్లి నటరాజ్‌ (రిటైర్డ్‌ హెచ్‌ఎంసీ అధికారి), భమిడిపాటి నరీన్‌ (రిటైర్డ్‌ హెచ్‌ఎం), భమిడిపాటి పాపయ్యశాస్త్రి (ఏబీఎం), భమిడిపాటి కొప్పయ్య (సైంటిస్ట్‌), కముజు సత్యనారాయణమూర్తి (వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి), విస్సాప్రగడ పేర్రాజు (ఏబీ బీఎం), బలుసు సాంబమూర్తి (ఖమ్మం భద్రాద్రి బ్యాంక్‌ ఎండీ), మిద్దే ఆదినారాయణ (టీడీపీ నాయకుడు) తదితరులు ఉండేవారు. మూడో తరం క్రీడాకారులు కూడా కొత్తపేటలో క్రికెట్‌ ఆటను కొనసాగించారు. దాంతో ఇక్కడ జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. కాలక్రమేణా ఇక్కడి క్రికెట్‌ క్రీడాకారులు విద్య, ఉద్యోగాలు,  వ్యాపారాల పేరిట వలసలు పోయారు. మరికొందరు స్థానికంగా ఉన్నా యాంత్రిక జీవనంలో సమయం లేక ఈ ఆటకు దూరమయ్యారు. దాంతో ఇక్కడ క్రికెట్‌ క్రీడాకారుల సంఖ్య తగ్గిపోయింది. ఉన్న వారు కూడా టీవీలు, సెల్‌ వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు అతుక్కుపోతున్నారు. కొందరు యువకులు అప్పుడప్పుడూ ఆడుతూ, స్థానిక స్థాయిలోనే పోటీలు నిర్వహిస్తున్నారు.

నేడు మూడు తరాల క్రీడాకారులు ఆత్మీయ కలయిక
కొత్తపేటలో క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో నాటి మూడు తరాల క్రికెట్‌ క్రీడాకారులందరూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14న కొత్తపేటలో కలుసుకుంటున్నారు. ‘కొత్తపేట క్రికెట్‌ స్వర్ణోత్సవ వేడుకలు’ నాటి క్రీడాకారుల ‘ఆత్మీయ కలయిక’ పేరుతో  సుమారు 100 మందిని సమీకరించనున్నట్టు పూర్వ క్రీడాకారుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్‌ గౌస్‌ ‘సాక్షి’కి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న వారందరికీ సమాచారం ఇచ్చామని, కొత్తపేట క్రీడా మైదానాన్ని వేదికగా చేసుకుని కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించనున్నామని చెప్పారు.1983లో అమలాపురంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన కొత్తపేట టీమ్‌ ఫొటోను ప్రదర్శించనున్నామని గౌస్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement