నేడు బోల్ట్ సందడి
యువరాజ్‌తో క్రికెట్ ఆడనున్న స్ప్రింట్ స్టార్
బెంగళూరు: ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తగల అథ్లెట్.. జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ తొలిసారిగా భారత్‌లో సందడి చేయనున్నాడు. అయితే ఇక్కడి అభిమానులు మాత్రం అతని పరుగు విన్యాసాన్ని చూడలేరు. ఎందుకంటే బోల్ట్ ఇక్కడికి ప్రస్తుతం అథ్లెట్‌గా కాకుండా ‘క్రికెటర్’గా వచ్చాడు. పుమా షూస్ కంపెనీ ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా నేడు (మంగళవారం) స్థానిక చిన్నస్వామి స్టేడియంలో బోల్ట్ క్రికెట్ ఆడనున్నాడు. ప్రత్యర్థి ఎవరో కాదు.. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. సెవెన్-ఎ-సైడ్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో భాగంగా వీరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు.
ఒక్కో ఇన్నింగ్స్ నాలుగు ఓవర్ల పాటు కొనసాగుతుంది. బోల్ట్ జట్టులో అతడి స్నేహితుడు నుజెంట్ వాల్కర్ జూనియర్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఉండగా.. యువీ జట్టులో పేసర్ జహీర్ ఖాన్ ఉన్నాడు. మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పుమా క్రికెట్ నిర్వహించిన డిజిటల్ కాంటెస్ట్‌లో నెగ్గిన ఏడుగురు విజేతలు కూడా ఇతర సభ్యులుగా ఉంటారు. ఈ మ్యాచ్‌లో బోల్ట్, యువీ పూర్తి ఓవర్లపాటు బ్యాటింగ్ చేస్తారు. అలాగే వికెట్ పడిన ప్రతిసారి జట్టు స్కోరులో నాలుగు పరుగులు తగ్గుతాయి.