బోల్ట్ రక్తంలోనే క్రికెట్ ఉంది: భజ్జీ
న్యూఢిల్లీ: జమైకా మేటి అథ్లెట్ ఉసేన్ బోల్ట్ బౌలింగ్ యాక్షన్ చాలా బాగుందని భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. బెంగళూరులో మంగళవారం జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో బోల్ట్, భజ్జీ కలిసి ఆడారు. ‘బోల్ట్ రక్తంలోనే క్రికెట్ ఉంది అతణ్ని చాలా దగ్గర్నించి పరిశీలించా. బౌలింగ్ రనప్ అద్భుతంగా ఉంది.
కచ్చితమైన బంతులను సంధించాడు. క్రీజులో నిలబడటం నుంచి బౌలింగ్ వరకు ప్రతి అంశం సూపర్బ్‌గా ఉంది. నా వరకు ఓ సాధారణ క్రికెటర్ మాదిరిగానే కనిపించాడు. నాతో పాటు యువీ దగ్గరకు వచ్చి మాట్లాడాడు. మా మ్యాచ్‌లను చూశానని, మా గురించి తెలుసని కూడా చెప్పాడు. అతనికి క్రికెట్‌పై చాలా ఆసక్తి ఉంది’ అని హర్భజన్ పేర్కొన్నాడు. ఫిఫా ప్రపంచకప్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం పీలేను కలిసే అవకాశం వచ్చిన తనకు ఇప్పుడు బోల్ట్‌తో కలిసి ఆడటం చాలా ప్రత్యేకంగా ఉందన్నాడు.
అథ్లెటిక్సే బెటర్...
కోచ్ చెప్పడం వల్లే క్రికెట్‌ను కాకుండా అథ్లెటిక్స్ ఎంచుకున్నట్లు బోల్ట్ చెప్పాడని భజ్జీ అన్నాడు. తన శిక్షణ షెడ్యూల్, టోర్నీల ప్రణాళికలను చూసి ఆశ్చర్యపోయానన్నాడు. ప్రతి టోర్నీకి బోల్ట్ సన్నద్ధమయ్యే తీరు చాలా భిన్నంగా ఉందన్నాడు. అభిమానులతో అతను ప్రవర్తించే తీరు తన హృదయాన్ని టచ్ చేసిందన్నాడు.
మళ్లీ జట్టులోకి వస్తా...
భారత క్రికెట్ జట్టులో మళ్లీ చోటు సంపాదిస్తానని హర్భజన్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్‌ను బుధవారం కలుసుకున్న సందర్భంగా హర్భజన్ విలేకరులతో మాట్లాడాడు. అనేక కారణాల వల్ల తాను చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నానని చెప్పాడు.