క్రికెట్‌లో బోల్ట్... రన్నింగ్‌లో యువరాజ్
బెంగళూరు: ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో వాయువేగంతో పరిగెత్తే జమైకన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ క్రికెటర్‌గానూ తానేంటో రుచి చూపించాడు. 19 బంతుల్లోనే 45 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇందులో ఐదు సిక్సర్లున్నాయి. మంగళవారం యువరాజ్ జట్టుతో జరిగిన సెవెన్-ఎ-సైడ్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో బోల్ట్ ఈ విన్యాసం చేశాడు. తన జోరుతో 59 పరుగుల లక్ష్యాన్ని చిట్ట చివరి బంతికి పూర్తి చేసిన ‘టీమ్ బోల్ట్’జట్టు నెగ్గింది. నాలుగు ఓవర్ల పాటు జరిగిన ఈ మ్యాచ్ పుమా ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా నిర్వహించారు. చివరి రెండు బంతుల్లో పది పరుగులు రావాల్సి ఉండగా ఆదిత్య తారే బౌలింగ్‌లో బోల్ట్ సిక్స్ బాదాడు. చివరి బంతికి అదే రీతిన ఆడబోయినా షాట్ మిస్సయింది.
దీంతో యువీ జట్టు సంబరాల్లో మునిగినా అంపైర్ స్థానంలో ఉన్న అజయ్ జడేజా దాన్ని ‘నోబాల్’గా ప్రకటించారు. దీంతో బోల్ట్ మరుసటి బంతిని సిక్సర్‌గా మలిచి జట్టును గెలిపించాడు. అంతకుముందు ‘టీమ్ యువరాజ్’ జట్టు 4 ఓవర్లలో 58 పరుగులు చేసింది. యువీ 14 బంతుల్లో 24 పరుగులు (4 ఫోర్లు; 1 సిక్స్) చేశాడు. క్రికెట్‌లో ఓడిన యువరాజ్ అథ్లెటిక్స్‌లో మాత్రం ‘మెరిశాడు’. సరదాగా సాగిన 100 మీటర్ల పరుగులో బోల్ట్‌తో పోటీపడిన యువరాజ్ తొలి స్థానంలో రేసును పూర్తి చేశాడు. ముందుగా వెళుతున్న బోల్ట్.. యువీకి దారి ఇచ్చాడు. రేసు పూర్తయ్యాక యువీ.. బోల్ట్ మోబో స్టయిల్లో అభివాదం చేశాడు.