
భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు
ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి.
బ్యాంకాక్: ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. సోమవారం జరిగిన 10 కిలో మీటర్ల నడక విభాగంలో సంజయ్ కుమార్... డిస్కస్ త్రో ఈవెంట్‌లో అభయ్ గుప్తా విజేతలుగా నిలిచారు. సంజయ్ 45 నిమిషాల 30.39 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అభయ్ గుప్తా డిస్క్‌ను 56.47 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. అంతేకాకుండా 2015లో సజ్జాద్ హసన్ (ఇరాన్–53.06 మీటర్లు) నెలకొల్పిన ఆసియా రికార్డును అభయ్ బద్దలు కొట్టాడు. డిస్కస్ త్రోలోనే భారత్‌కే చెందిన సాహిల్ సల్వాల్(54.58 మీటర్లు) రజతం గెల్చుకున్నాడు.
జ్యోతికశ్రీకి నాలుగో స్థానం...
బాలికల 400 మీటర్ల పరుగు ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతికశ్రీ 56.57 సెకన్లలో రేసును పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో జియాది మో (చైనా–55.19 సెకన్లు), జూ సువాన్ వాంగ్ (చైనీస్ తైపీ–55.81 సెకన్లు), మరియమ్ మోబీబీ (ఇరాన్–55.94 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు లభించాయి.