ట్వంటీ 20: అఫ్గాన్ ప్లేయర్ అరుదైన రికార్డ్
గ్రేటర్ నోయిడా: ట్వంటీ 20 ఫార్మాట్ లో అఫ్గనిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అఫ్గాన్ క్రికెటర్ మహమ్మద్ నబీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆరు లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి ఓ ట్వంటీ20 మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఫీట్ నెలకొల్పాడు నబీ. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మూడో ట్వంటీ 20లో నబీ భారీ హాఫ్ సెంచరీ(30 బంతుల్లో 89: 6 ఫోర్లు, 9 సిక్సర్లు) సాధించడంతో అఫ్గాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి ప్రత్యర్ది ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఈ క్రమంలో ఆరు లేదా అంతకన్నా దిగువ స్థానాల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ వైట్ నెలకొల్పిన అత్యధిక పరుగుల (85 నాటౌట్) రికార్డును అదిగమించాడు. ఆ తర్వాతి స్థానాల్లో స్లాట్లాండ్ క్రికెటర్ మామ్‌సెన్(68 నాటౌట్), జింబాబ్వే ప్లేయర్ వాల్లర్ (68), పాక్ వెటరన్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ (66 నాటౌట్) ఉన్నారు.
234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. 28 పరుగుల తేడాతో అఫ్గాన్ చేతిలో వరుసగా మూడో ట్వంటీ20లోనూ ఓటమిని చవిచూసింది. ఐర్లాండ్ ఓపెనర్లు స్టిర్లింగ్(49), థాంప్సన్(43) తో పాటు కీపర్ విల్సన్ హాఫ్ సెంచరీ(34 బంతుల్లో 59: 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా ఫలితం దక్కలేదు. ఐర్లాండ్ తన చివరి 5 వికెట్లను కేవలం ఐదు పరుగుల తేడాతో కోల్పోవడం ఆ జట్టు విజయాన్ని అడ్డుకుంది.