
ఎనిమిదేళ్ల తర్వాత...
భారత వన్డే జట్టు కెప్టెన్ ధోని సుదీర్ఘ కాలం తర్వాత దేశవాళీ క్రికెట్‌లో తన సొంత జట్టు జార్ఖండ్ తరఫున బరిలోకి దిగుతున్నాడు.
జార్ఖండ్ తరఫున బరిలోకి ధోని
నేటినుంచి విజయ్ హజారే ట్రోఫీ
ఆలూరు (కర్ణాటక): భారత వన్డే జట్టు కెప్టెన్ ధోని సుదీర్ఘ కాలం తర్వాత దేశవాళీ క్రికెట్‌లో తన సొంత జట్టు జార్ఖండ్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. నేటినుంచి జరగనున్న విజయ్ హజారే వన్డే ట్రోఫీలో అతను వరుణ్ ఆరోన్ కెప్టెన్సీలో ఆడతాడు. జార్ఖండ్ తమ తొలి మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌తో తలపడుతుంది. 2009 అక్టోబర్‌లో ఇండియా బ్లూ సభ్యుడిగా తన చివరి దేశవాళీ వన్డే ఆడిన ధోని... అంతకు రెండున్నరేళ్ల క్రితమే 2007లో ఏప్రిల్‌లో ఆఖరి సారి జార్ఖండ్ తరఫున ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ బరి లోకి దిగాడు. ధోనితో పాటు పలువురు అగ్రశ్రేణి క్రికెటర్లు తమ సొంత జట్ల తరఫున ఆడుతుండటంతో టోర్నీపై ఆసక్తి పెరిగింది. దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన అశ్విన్ కూడా తమిళనాడు కెప్టెన్‌గా పోరుకు సిద్ధమయ్యాడు.
మారిన లీగ్ ఫార్మాట్
గత ఏడాది వరకు జోనల్ పద్ధతిలో నిర్వహించిన ఈ టోర్నీని ఈ సారి దాదాపు రంజీ తరహాలోకి మార్చారు. మొత్తం 27 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌నుంచి టాప్-2 టీమ్‌లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో, గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లు బెంగళూరు, ఆలూరులలో, గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లు ఢిల్లీలో, గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లు రాజ్‌కోట్‌లలో జరగనున్నాయి.