
భారత జట్టు మళ్లీ అదరగొట్టింది... మూడో టెస్టు నుంచి మొదలైన జోరు ఇప్పుడు మూడో వన్డే వరకు సాగింది... మరో ఏకపక్ష పోరులో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా సిరీస్‌లో మన ఆధిక్యాన్ని మరింత బలంగా ప్రదర్శించింది. ముందుగా కోహ్లి వీరశతకం, ధావన్ దూకుడుతో చెలరేగిన భారత్... ఆ తర్వాత మళ్లీ తన స్పిన్ ఉచ్చులో దక్షిణాఫ్రికాను పడేసింది. ఇక తర్వాతి అంకం తొలిసారి సిరీస్ గెలుచుకొని సగర్వంగా నిలబడటమే.
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా గడ్డపై గత నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా ఓటమి పాలైన భారత్ ఇప్పుడు ఆ గండాన్ని మాత్రం దిగ్విజయంగా దాటేసింది. హ్యాట్రిక్ విజయంతో ఇక వన్డే సిరీస్ కోల్పోయే అవకాశం లేని స్థితిలో నిలిచింది. బుధవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్ 124 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (159 బంతుల్లో 160 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగగా... శిఖర్ ధావన్ (63 బంతుల్లో 76; 12 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా కుల్దీప్ (4/23), చహల్ (4/46) మాయాజాలానికి 40 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. జేపీ డుమిని (67 బంతుల్లో 51; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. తాజా ఫలితంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ 3–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగో వన్డే శనివారం జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది.
భారీ భాగస్వామ్యం...
దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్ శర్మ వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. రబడ వేసిన తొలి ఓవర్లోనే రోహిత్ (0) కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో సున్నా వద్దే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లి సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడు అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో బంతి బ్యాట్‌ను తాకిందని తేలడంతో అతను బతికిపోయాడు. ఆ తర్వాత ధావన్, కోహ్లి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. బలహీనంగా కనిపించిన సఫారీ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు దూసుకుపోయారు. ఎక్కడా తడబాటు లేకుండా వీరిద్దరు స్వేచ్ఛగా ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. ముఖ్యంగా తొలి వన్డే ఆడుతున్న ఇన్‌గిడి 4 ఓవర్ల మొదటి స్పెల్‌లో భారత్ 6 ఫోర్లతో 29 పరుగులు రాబట్టింది. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 10 ఫోర్లతో 50 పరుగులు చేసింది. ఈ జోరులో ధావన్ 42 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం 100 పరుగులు దాటిన తర్వాత 64 బంతుల్లో కోహ్లి కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే డుమిని బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి ధావన్ వెనుదిరగడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. అనవసరపు షాట్‌కు ప్రయత్నించి రహానే (11) అవుట్ కాగా, పాండ్యా (14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో దక్షిణాఫ్రికా కొంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. ఫలితంగా పరుగుల వేగం మందగించింది. ధోని (22 బంతుల్లో 10) పూర్తిగా నిరాశపర్చగా... జాదవ్ (1) తనకు లభించిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. అయితే భువనేశ్వర్ (16 నాటౌట్) అండగా నిలవడంతో కోహ్లి మళ్లీ జట్టు ఇన్నింగ్స్‌ను సరైన దారిలో పెట్టాడు. కోహ్లి, భువీ ఏడో వికెట్‌కు అభేద్యంగా 67 పరుగులు జోడించడం విశేషం. చివరి ఐదు ఓవర్లలో 47 పరుగులు రాబట్టిన భారత్ 300 పరుగుల స్కోరును దాటింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
డుమిని మినహా...
పేసర్ బుమ్రా తాను వేసిన తొలి బంతికే ఆమ్లా (1)ను అవుట్ చేసి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. ఈ దశలో కెప్టెన్ మార్క్‌రమ్ (42 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), డుమిని కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. అయితే కుల్దీప్ తొలి ఓవర్లో ముందుకు వచ్చి ఆడటానికి ప్రయత్నించిన మార్క్‌రమ్‌ను ధోని స్టంపౌట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత చక్కటి బంతితో క్లాసెన్ (6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న చహల్, తన తర్వాతి ఓవర్లో డుమినిని కూడా పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత మిల్లర్ (25) పోరాడే ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. వరుస ఓవర్లలో మోరిస్ (14), జోండో (17) అవుట్ కాగా... ఫెలుక్‌వాయో (3)ను కుల్దీప్ దెబ్బ తీయడంతో దక్షిణాఫ్రికా విజయంపై ఆశలు కోల్పోయింది.
►4 వన్డేల్లో 400 మందిని అవుట్ చేయడంలో భాగ మైన నాలుగో వికెట్ కీపర్ ధోని. సంగక్కర (482), గిల్‌క్రిస్ట్ (472), బౌచర్ (424) ముందున్నారు.
► 8 వన్డేల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఎనిమిదో భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. ధోని (216) తొలి స్థానంలో ఉన్నాడు.
► 1 టెస్టుల్లో (14), వన్డేల్లో (12) అత్యధిక సెంచరీలు కొట్టిన భారత కెప్టెన్‌గా కోహ్లి రికార్డు.
► 1 ఒకే వన్డేలో భారత్ తరపున ఇద్దరు స్పిన్నర్లు నాలుగు వికెట్ల చొప్పున తీయడం ఇదే ప్రథమం.
►1 కెరీర్‌లో 34వ సెంచరీ చేసిన క్రమంలో దక్షిణాఫ్రికాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్ గా కోహ్లి రికార్డులకెక్కాడు. సచిన్ (152) స్కోరును అతను దాటేశాడు.
Comments
Please login to add a commentAdd a comment