సచిన్ తరువాత రహానె..
ధర్మశాల: టీమిండియా క్రికెట్ లో అజింక్యా రహానే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.భారత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గాయం కారణంగా ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు దూరం కావడంతో ఆ స్థానంలో నాయకత్వ బాధ్యతలను రహానేకు అప్పగించారు. దాంతో భారత్ 33వ టెస్టు సారథిగా రహానే రికార్డులెక్కాడు. మరొకవైపు ముంబై నుంచి వచ్చిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ తర్వాత కెప్టెన్ గా ఎంపికైన రికార్డు కూడా రహానేకే దక్కింది. ఇదిలా ఉంచితే, ముంబై నుంచి వచ్చి భారత జట్టుకు టెస్టు కెప్టెన్సీ చేసిన దిగ్గజాల సరసన రహానే చేరాడు. పాలీ ఉమ్రిగర్, నారీ కాంట్రాక్టర్, రామ్ చంద్, అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగసర్కార్, రవిశాస్త్రి, సచిన్ల సరసన రహానే చేరాడు.
ఇదే సమయంలో విరాట్ కోహ్లి టెస్టు మ్యాచ్ ను మిస్ కావడం 2011 నవంబర్ తరవాత ఇదే తొలిసారి. అప్పట్నుంచి ఈ టెస్టు మ్యాచ్ ముందు వరకూ విరాట్ ఒక్క మ్యాచ్ను కూడా మిస్ కాలేదు. ఈ క్రమంలోనే వరుసగా 54 టెస్టులను విరాట్ ఆడాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ నిర్ణయాత్మక టెస్టు నుంచి కోహ్లి చివరినిమిషంలో వైదొలిగాడు. రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లి ఆఖరు వరకూ తుది జట్టులో ఉండేందుకు యత్నించినా ఫిట్నెస్ ను నిరూపించుకోలేకపోయాడు. దాంతో టెస్టు మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.