వైస్ కెప్టెన్ రహానేపై వేటు
ముంబై: ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ముంబై టెస్టుకు ముందురోజు టీమిండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. సిరీస్లో పేలవఫామ్ కొనసాగిస్తున్న వైస్ కెప్టెన్ అజింక్య రహానేపై వేటు పడింది. ముంబైలో రేపు(గురువారం) ప్రారంభం కానున్న నాలుగో టెస్టు, చెన్నైలో జరిగే ఐదో టెస్టుకూ రహానే దూరం కానున్నాడు. ఫామ్ లేమి కారణంగానే అతడిని రెండు టెస్టులకు పక్కన పెట్టాలని సెలక్షన్ కమిటీ భావించింది. అయితే రహానే కుడిచేతి చూపుడువేలుకు గాయమైనందున విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గాయం తీవ్రత తక్కువగా ఉన్నా రహానే ఫామ్ లేమి వల్లే నాలుగో టెస్టుకు దూరమయ్యాడు.రహానే స్థానంలో మనీశ్ పాండే చోటు దక్కించుకున్నాడు.
బౌలింగ్ విభాగంలో ఒక మార్పు చేయనున్నట్లు ప్రకటనలో బీసీసీఐ వెల్లడించింది. ప్రధాన పేసర్ మహమ్మద్ షమీ ముంబై టెస్టుకు దూరం కానున్నాడు. మోకాలి సమస్య వల్ల షమీ ఇబ్బంది పడుతున్నట్లు టీమిండియా ఫిజియో తెలిపాడు. షమీ స్థానంలో కొత్త పేసర్ శార్దూల్ ఠాకూర్ జట్టులోకి రానున్నాడు. మనీశ్ పాండే ఈ రంజీ సీజన్లో రెండు మ్యాచులలో కలిపి 188 పరుగులు చేయగా, మరోవైపు పేసర్ శార్దూల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 45 మ్యాచ్లు ఆడి 155 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే జట్టులో మనీశ్ స్థానం పర్మినెంట్ చేయాలనే ఉద్దేశంతోనే టెస్టుల్లో అతడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ గాయాలతో ఇప్పటికే టెస్ట్ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే.