అజిత్ అగార్కర్
ముంబై: భారత సీనియర్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ పదవి కోసం భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ పోటీపడుతున్నాడు. గురువారమే అతడు దరఖాస్తు చేసుకున్నాడంటూ ఊహాగానాలు రాగా... అవి నిజమేనంటూ శుక్రవారం అగార్కర్ వివరణ ఇచ్చాడు. ఇతనితో పాటు ఇప్పటికే జూనియర్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన భారత మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా చీఫ్ సెలక్టర్ పదవి రేసులో ఉన్నాడు. దాంతో చీఫ్ సెలక్టర్ పదవి రేసులో ఇప్పటికే ఉన్న భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, ఆఫ్ స్పిన్నర్ రాజేశ్ చౌహాన్‌లకు అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్‌ల నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు.
ఇప్పటికే ముంబై సీనియర్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి మొత్తం 349 వికెట్లు తీశాడు. సెలక్షన్ కమిటీలో ఏర్పడిన రెండు ఖాళీలల కోసం దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియగా... తొమ్మిది మంది పోటీ పడుతున్నారు.
గడువులోపు దరఖాస్తు చేసుకున్న మాజీ భారత క్రికెటర్లు: అజిత్ అగార్కర్ (ముంబై), వెంకటేశ్ ప్రసాద్ (కర్ణాటక), చేతన్ శర్మ (హరియాణా), నయన్ మోంగియా (బరోడా), లక్ష్మణ్ శివరామకృష్ణన్ (తమిళనాడు), రాజేశ్ చౌహాన్ (మధ్య ప్రదేశ్), అమేయ్ ఖురాసియా (మధ్య ప్రదేశ్), జ్ఞానేంద్ర పాండే (ఉత్తర ప్రదేశ్), ప్రీతమ్ గాంధీ (విదర్భ).
Comments
Please login to add a commentAdd a comment