selection committee Chairman
-
పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్‌గా ఇంజమామ్ ఉల్ హాక్
పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్.. ఆ దేశ జాతీయ పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా నియమించబడ్డాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ధృవీకరించింది. గత వారమే పాకిస్తాన్ క్రికెట్ టెక్నికల్ కమిటీలో చేరిన ఇంజమామ్.. తాజాగా చీఫ్ సెలెక్టర్‌గానూ బాధ్యతలు చేపట్టినట్లు పీసీబీ వెల్లడించింది. ఇంజమామ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ త్వరలో పాక్ ఆడనున్న ఆఫ్ఘనిస్తాన్ సిరీస్, ఆసియా కప్‌కు జట్లను ప్రకటిస్తుందని పీసీబీ ప్రతినిధి తెలిపారు. సెలెక్షన్ కమిటీలో ఇంజమామ్‌తో పాటు టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, హెడ్‌కోచ్ బ్రాడ్‌బర్న్ ఉంటారని, ఇంజమామ్ వీరి ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకుని జట్టును ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రతిపాదన మేరకు టీమ్ డైరెక్టర్, హెడ్ కోచ్‌లను సెలెక్షన్ ప్యానెల్లో కొనసాగించామని స్పష్టం చేశారు. ఇంజమామ్, ఆర్థర్, బ్రాడ్‌బర్న్ త్రయం.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్, ఆసియా కప్‌లతో పాటు భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు కూడా జట్టును ప్రకటిస్తారని తెలిపారు. మాజీ ఆటగాడు మిస్బా ఉల్ హాక్ నేతృత్వంలోని పీసీబీ క్రికెట్ టెక్నికల్ కమిటీ ఇంజమామ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని ప్రతిపాదించి, ఆమోదించిందని వెల్లడించారు. ఇంజమామ్ ఎంపికకు పీసీబీ చైర్మన్ జకా అష్రాఫ్ కూడా అమోద ముద్ర వేసారని అన్నారు. కాగా, ఇంజమామ్ గతంలో 2016 నుండి 2019 వరకు పాక్ నేషనల్ మెన్స్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలో ఎంపిక చేసిన జట్టు 2017లో సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. -
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్
ముంబై: భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్‌ను నియమించినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. సెలెక్షన్ ప్యానెల్లో ఖాళీగా ఉన్న ఒక సెలెక్టర్ పదవి కోసం అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం ఇంటర్వ్యూలు చేసింది. చివరకు అగార్కర్ పేరును ఈ పదవి కోసం సీఏసీ ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. అనంతరం అగార్కర్ అనుభవం దృష్ట్యా చీఫ్ సెలెక్టర్ పదవికి కూడా సీఏసీ అతని పేరునే సూచించింది. ముంబైకి చెందిన 45 ఏళ్ల అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2007లో ధోని సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో అగార్కర్ సభ్యుడిగా ఉన్నాడు. వన్డేల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాటర్ రికార్డు ఇప్పటికీ అగార్కర్ పేరిటే ఉంది. 2000లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో అగార్కర్ 21 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ప్లేయర్‌గా కెరీర్ ముగిశాక అగార్కర్ ముంబై జట్టు చీఫ్ సెలెక్టర్‌గా, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. క్రికెట్ దిగ్గజం ఒకరు అగార్కర్ పదవి చేపట్టడం వెనుక పావులు కదిపినట్లు తెలుస్తోంది. కాగా, గత కొద్ది రోజులుగా చీఫ్ సెలెక్టర్ జీతం విషయంలో చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. బీసీసీఐలో అత్యున్నత పదవిలో ఉండే వ్యక్తికి కేవలం కోటి రూపాయల జీతం ఉండటంపై చాలా మంది ఈ పదవిపై ఆనాసక్తి చూపారు. డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే కారణంగా చీఫ్ సెలెక్టర్ పోస్ట్‌పై అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ: అజిత్ అగార్కర్ (చైర్మన్), శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్. -
బీసీసీఐలోకి చేతన్ శర్మ.. మరోసారి సెలెక్టర్‌గా బాధ్యతలు
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తిరిగి సెలక్షన్ బాధ్యతలను చేపట్టాడు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. టీమిండియా ఫేక్ ఫిట్ నెస్ సీక్రెట్స్, ఆటగాళ్ల ఎంపిక, విశ్రాంతి పేరుతో ఆటగాళ్లను ఆటకూ దూరం చేసే అదృష్టశక్తులు, ఎవరిని డ్రాప్ చేయాలి, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలని అనేది నిర్ణయించేది ఎవరు? బిసీసీఐ చీఫ్ గా సౌరబ్ గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన ఘర్షణల గురించి.. విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మ మధ్య ఉన్న ఈగో క్లాషెస్ గురించి.. ఇలా చెప్పుకుంటూపోతే బిసిసిఐకి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. దీంతో అతడు బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చేతన్ స్వయంగా బీసీసీఐకి తన రాజీనామాను సమర్పించాడు. అప్పటి నుంచి నాలుగు నెలల పాటు ఎవరికి కనిపించని చేతన్ శర్మ కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేడు.అయితే తాజాగా మరోసారి సెలక్షన్ కమిటీలో బాధ్యతలు చేపట్టాడు. కానీ జాతీయ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా కాకుండా నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చైర్మెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ జోన్ టీమ్ కు సెలక్షన్ కమిటీలో చేతన్ శర్మ భాగమయ్యాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా చేతన్ శర్మ సారథ్యంలోని నార్త్ జోన్.. తమ జట్టుకు మన్దీప్ సింగ్ ను సారథిగా ఎంపిక చేసింది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అదగరొట్టిన పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ తో పాటు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సంచలనం నెహల్ వధెరా లు కూడా నార్త్ జోన్ లో ఉన్నారు. కాగా ఈ టీమ్ లో జయంత్ యాదవ్ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్ గా ఉన్నాడు. చదవండి: భార్య జెర్సీతో బరిలోకి.. తొలి మ్యాచ్‌లోనే ఉతికారేశాడు -
షాహిద్ అఫ్రిదికి షాకిచ్చిన పీసీబీ.. చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుంచి తొలగింపు
Shahid Afridi: పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు తాత్కాలిక చీఫ్ సెలెక్టర్, ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాకిచ్చింది. అఫ్రిదిని సెలెక్టర్ పదవి నుంచి తొలిగిస్తున్నట్లు పీసీబీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. అఫ్రిది స్థానంలో 69 ఏళ్ల హరూన్ రషీద్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. కమిటీలోని మిగతా సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని పీసీబీ పేర్కొంది. పీసీబీ చీఫ్‌గా నజమ్ సేథీ బాధ్యతలు చేపట్టాక నాటి చీఫ్ సెలెక్టర్ మహ్మద్ వసీంను తొలగించిన పీసీబీ.. ఆ పదవిలో అఫ్రిదిని తాత్కాలికంగా కూర్చోబెట్టింది. తాజాగా పీసీబీ అఫ్రిదికి కూడా ఉద్వాసన పలికి హరూన్ రషీద్‌కు బాధ్యతలు అప్పజెప్పడం పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ తరఫున 23 టెస్ట్‌లు, 12 వన్డేలు ఆడిన హరూన్ రషీద్.. 2015 నుంచి 2016 వరకు పాక్ చీఫ్ సెలెక్టర్‌గా పని చేశాడు. రషీద్.. పీసీబీని నడుపుతున్న 14 మంది సభ్యుల క్రికెట్ మేనేజ్మెంట్ కమిటీలోనూ కీలక మెంబర్‌గా కొనసాగుతున్నాడు. కాగా, స్వదేశంలో గతకొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీకి కొత్త బాస్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఆస్ట్రేలియా మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కన్నుమూత..!
క్రికెట్ ఆస్ట్రేలియా మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ లారీ సాల్(96) మంగళవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో పెర్త్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాల్ మరణించినట్లు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. 1982 నుంచి 1995 వరకు ఆస్ట్రేలియా జట్టుకు జాతీయ సెలెక్టర్‌గా పనిచేశారు. అతని పని చేసిన కాలంలోనే స్టీవ్ వా,మార్క్ వా, మార్క్ టేలర్, ఇయాన్ హీలీ, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, డామియన్ మార్టిన్, జస్టిన్ లాంగర్, మాథ్యూ హేడెన్ వంటి ఆసీసీ దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇక వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున 35 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సాల్ 1701 పరుగులు చేశాడు. అతని కెరీర్లో ఒక ఫస్ట్ క్లాస్ సెంచరీ ఉంది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 7వ ఆస్ట్రేలియన్ ఇన్ఫాంట్రీ బెటాలియన్‌లో పనిచేసినందున లారీ సాల్‌కు 'కల్నల్' అనే మారుపేరు కూడా ఉంది. చదవండి: TNPL: మురళీ విజయ్‌కు చేదు అనుభవం.. డీకే..డీకే అంటూ ఫాన్స్ కేకలు.. అతనేం చేశాడంటే..! -
జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా శరత్
జాతీయ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా తమిళనాడు రంజీ క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ శ్రీధరన్ శరత్ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు జట్టు తరఫున 100 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా శరత్ ఘనత వహించాడు. ఈ కమిటీలో కిషన్ మోహన్, రణదేవ్ బోస్, పథీక్ పటేల్, హరీ్వందర్ సింగ్ సోధీ ఇతర సభ్యులు. ఈ కమిటీ వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరిగే అండర్–19 ప్రపంచ కప్ కోసం త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనుంది. -
జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ స్టార్ క్రికెటర్..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం కొత్త జూనియర్ సెలక్షన్ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా తమిళనాడు రంజీ జట్టు మాజీ కెప్టెన్ శ్రీధరన్ శరత్‌ను నియమించింది. సౌత్ జోన్ నుంచి శ్రీధరన్ శరత్, వెస్ట్ జోన్ నుంచి పాథిక్ పటేల్, సెంట్రల్ జోన్ నుంచి హర్విందర్ సింగ్ సోధి, ఈస్ట్ జోన్ నుంచి బెంగాల్ మాజీ ఫాస్ట్ బౌలర్ రణదేబ్ బోస్ ప్రాతినిధ్యం వహిస్తారని బీసీసీఐ పేర్కొంది. ఇదిలా ఉంటే, జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన శ్రీధరన్ శరత్.. తమిళనాడు తరఫున 139 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 27 సెంచరీలు, 42 అర్ధ సెంచరీల సాయంతో 8700 పరుగులు(51 సగటులో) చేశాడు. శ్రీధరన్ శరత్ తమిళనాడు తరపున 100 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. శ్రీధరన్ శరత్ నేతృత్వంలోని కొత్త సెలెక్షన్ కమిటీ త్వరలో అండర్-19 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. అండర్ -19 ప్రపంచకప్ వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జరుగనుంది. చదవండి: గంటల వ్యవధిలో పాక్ క్రికెట్‌కు మరో షాక్.. ? -
సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ
అహ్మదాబాద్: భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ పేస్ బౌలర్ చేతన్ శర్మ (నార్త్ జోన్) ఎంపికయ్యాడు. గురువారం జరిగిన బీసీసీఐ ఎజీఎంలో ఈ ఎంపికను ఖరారు చేశారు. చేతన్‌తో పాటు సెలక్షన్ కమిటీలో మాజీ పేసర్లు అబయ్ కురువిల్లా, దేవాశీష్ మొహంతి లకు కూడా అవకాశం దక్కింది. మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లు సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త సెలక్టర్లను ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో ఇప్పటికే సునీల్ జోషి, హర్వీందర్ సింగ్ ఉన్నారు. కొత్తగా ఎంపికైన ముగ్గురు వీరితో జత కలుస్తారు. ఇప్పటి వరకు జోషి చైర్మన్‌గా వ్యవహరించినా... నిబంధనల ప్రకారం ఐదుగురిలో ఎక్కువ టెస్టులు ఆడిన చేతన్ శర్మ ఇకపై చీఫ్ సెలక్టర్ హోదాలో పని చేస్తాడు. వెస్ట్ జోన్‌నుంచి చివరి నిమిషం వరకు అజిత్ అగార్కర్ పేరు వినిపించినా... అనూహ్యంగా కురువిల్లాకు అవకాశం లభించింది. వీరితో పాటు సెలక్టర్ పదవి కోసం మణీందర్ సింగ్, నయన్ మోంగియా, శివసుందర్ దాస్, రణదేబ్ బోస్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో ఐదుగురూ బౌలర్లే (నలుగురు పేస్, ఒకరు స్పిన్నర్) కావడం విశేషం! తొలి హ్యాట్రిక్‌తో... పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో చేతన్ శర్మ భారత్ తరఫున 23 టెస్టులు (61 వికెట్లు), 65 వన్డేలు (67 వికెట్లు) ఆడాడు. 1987 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ‘హ్యాట్రిక్’ తీసిన చేతన్...ఈ రికార్డు సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే అంతకు ముందు ఏడాది ఆస్ట్రలేసియా కప్ ఫైనల్లో అతని బౌలింగ్‌లో చివరి బంతికి మియాందాద్ సిక్సర్ బాది పాక్‌ను గెలిపించిన క్షణం చేతన్‌ను సుదీర్ఘ కాలం వెంటాడటంతో అతని ఘనతలకు తగిన గుర్తింపు దక్కలేదు. దేవాశీష్ మొహంతి భారత్ తరఫున 2 టెస్టులు (4 వికెట్లు), 45 వన్డేలు (57 వికెట్లు) ఆడగా... అబయ్ కురువిల్లా 10 టెస్టులు (25 వికెట్లు), 25 వన్డేల్లో (25 వికెట్లు) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. -
సెలక్టర్ రేసులో అగార్కర్
ముంబై: భారత సీనియర్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ పదవి కోసం భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ పోటీపడుతున్నాడు. గురువారమే అతడు దరఖాస్తు చేసుకున్నాడంటూ ఊహాగానాలు రాగా... అవి నిజమేనంటూ శుక్రవారం అగార్కర్ వివరణ ఇచ్చాడు. ఇతనితో పాటు ఇప్పటికే జూనియర్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన భారత మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా చీఫ్ సెలక్టర్ పదవి రేసులో ఉన్నాడు. దాంతో చీఫ్ సెలక్టర్ పదవి రేసులో ఇప్పటికే ఉన్న భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, ఆఫ్ స్పిన్నర్ రాజేశ్ చౌహాన్‌లకు అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్‌ల నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఇప్పటికే ముంబై సీనియర్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 349 వికెట్లు తీశాడు. సెలక్షన్ కమిటీలో ఏర్పడిన రెండు ఖాళీలల కోసం దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియగా... తొమ్మిది మంది పోటీ పడుతున్నారు. గడువులోపు దరఖాస్తు చేసుకున్న మాజీ భారత క్రికెటర్లు: అజిత్ అగార్కర్ (ముంబై), వెంకటేశ్ ప్రసాద్ (కర్ణాటక), చేతన్ శర్మ (హరియాణా), నయన్ మోంగియా (బరోడా), లక్ష్మణ్ శివరామకృష్ణన్ (తమిళనాడు), రాజేశ్ చౌహాన్ (మధ్య ప్రదేశ్), అమేయ్ ఖురాసియా (మధ్య ప్రదేశ్), జ్ఞానేంద్ర పాండే (ఉత్తర ప్రదేశ్), ప్రీతమ్ గాంధీ (విదర్భ). -
సెలక్షన్ కమిటీకి వెంకటేశ్ ప్రసాద్ రాజీనామా!
సాక్షి, స్పోర్ట్స్ : అండర్-19 ప్రపంచకప్ గెలిచి నెల కూడా తిరుగకుండానే జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ రాజీనామా చేశారు. సుమారు 30 నెలలుగా ఈ పదవిలో కొనసాగిన వెంకటేశ్ ప్రసాద్ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశాన్ని ప్రసాద్ ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. కొన్ని ఇతర క్రికెట్ అసైన్మెంట్ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారని, అవి ఏమిటో రాజీనామా పత్రంలో స్పష్టతనివ్వలేదని బీసీసీఐ తాత్కలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మీడియాకు తెలిపారు. అతని స్థానంలో ప్రత్యామ్నయంగా ఎవరి ఎంపిక చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మరి కొద్ది రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామ సీకే ఖన్నా పేర్కొన్నారు. ఇక ప్రసాద్ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జూనియర్ జట్లు (అండర్-19, భారత్-ఏ) అద్బుత ప్రదర్శన కనబర్చాయి. దీంతో అప్పట్లో ఆయనకు సీనియర్ జట్టు సెలక్షన్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐ జూనియర్ ప్యానెల్లోనే కొనసాగించింది. ఇక జాతీయ సెలక్టర్లుగా ఉన్న ఆరుగురి సభ్యుల్లో(ముగ్గురు జూనియర్, ముగ్గురు సీనియర్) వెంకటేశ్ ప్రసాదే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఆయన తన కెరీర్లో 33 టెస్టులు, 161 వన్డేలాడారు. -
ధోనికి ఝలక్
శ్రీలంకతో పర్యటనకు జట్టు ప్రకటన కంటే ఆ తర్వాత సెలక్షన్ కమిటీ చైర్మన్ మాట్లాడిన మాటలు బాగా ఆసక్తికరంగా ఉన్నాయి. టెస్టు జట్టును పూర్తిగా కోహ్లికి నచ్చినట్లుగా ఇచ్చేశారు. సరే... కెప్టెన్ ఏం కోరితే అది చేయొచ్చు. కానీ వన్డే కెప్టెన్ ధోనిని పూచికపుల్లలా తీసి పారేసినట్లు కనిపిస్తోంది. సందీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యల్లో పరోక్షంగా చాలా అర్థాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ పర్యటన ముగిశాక ధోని భారత పేసర్ల గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ‘లైన్ అండ్ లెంగ్త్ లేని ఫాస్ట్ బౌలర్లు కావాలా? లేక వేగం లేకపోయినా కచ్చితత్వంతో బౌలింగ్ చేసే వాళ్లు కావాలా అనేది తేల్చుకోవాలి’ అన్నాడు. దీనిపై ఇప్పుడు సందీప్ పాటిల్ స్పందించారు. ‘కెప్టెన్‌గా ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ ధోనికి ఉంటుంది. అతని అభిప్రాయాలు ఏమిటనేది మాకు అనవసరం. మంచి సమతుల్యంతో జట్టును ఎంపిక చేయడమే మా పని. ధోని కామెంట్స్ ఏమైనా ఉంటే బోర్డు చూసుకుంటుంది. మా పేస్ విభాగం చాలా బాగుంది. నలుగురు పేసర్లలోనూ నైపుణ్యం ఉంది’ అన్నారు. ఒక రకంగా ఇది ధోనికి కౌంటర్ ఇవ్వడమే. రైనా, జడేజా టెస్టు జట్టులో ఎందుకు లేరనే ప్రశ్నకు కూడా పాటిల్ విభిన్నంగా సమాధానం ఇచ్చారు. ‘కెప్టెన్సీలో మార్పులు జరిగిన తర్వాత సహజంగానే జట్టులో మార్పులు వస్తాయి. ప్రతి కెప్టెన్‌కూ ఓ విధానం ఉంటుంది. ఒకరు దూకుడు శైలిని అవలంబిస్తే, మరొకరు డిఫెన్సివ్‌గా ఉంటారు. వారి శైలికి కావలసిన ఆటగాళ్లను అడిగే హక్కు ఉంటుంది’ అన్నారు. అంటే ఇన్నాళ్లూ రైనా, జడేజా ఇద్దరూ ధోని ప్రాపకం వల్లే జట్టులో కొనసాగారనే అర్థం ధ్వనించింది. టెస్టుల్లోనూ కెప్టెన్‌గా ధోని భారత్ గర్వించదగ్గ విజయాలు సాధించాడు. తాను నమ్మిన యువ మంత్రంతో ఫలితాలు రాబట్టాడు. ఓ రకంగా సీనియర్ త్రయం వైదొలిగాక ప్రత్యామ్నాయాలను వెతికి పెట్టాడు. మరి ధోని స్థాయిలో కోహ్లి ఫలితాలు సాధిస్తాడా అంటే... ‘టెస్టు కెప్టెన్‌గా ధోని అద్భుతమైన ఫలితాలు సాధించాడు. కోహ్లి కూడా బాగానే ప్రారంభించాడు. తనకు కొంత సమయం ఇస్తే తాను కూడా నిరూపించుకుం టాడు. ఏం జరుగుతుందో అని ముందే ఆందోళన చెందాల్సిన పనిలేదు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ రిటైరైతే ప్రత్యామ్నాయాలు దొరకవని ఆందోళన చెందాం. కానీ అద్భుతమైన క్రికెటర్లు లభిం చారు’ అని చెప్పారు. ఓ రకంగా ధోని వైదొలగడం వల్ల నష్టమేం లేదనే పద్ధతిలో మాట్లాడారు. ధోని జట్టులో ఉన్నంతకాలం టెస్టు సిరీస్‌కు రిజర్వ్ వికెట్ కీపర్లను తీసుకెళ్లారు. ఇప్పుడు రిజర్వ్ లేడు. దీనిపై పాటిల్ ‘ఏవైనా గాయాలైతే చూద్దాంలే’ అని తేలికగా తీసుకున్నారు. అంటే ధోని అప్పట్లో ఫిట్‌గా లేడని చెప్పడమా ఇది.