ముంబై: భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్‌ను నియమించినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. సెలెక్షన్ ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న ఒక సెలెక్టర్ పదవి కోసం అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం ఇంటర్వ్యూలు చేసింది. చివరకు అగార్కర్ పేరును ఈ పదవి కోసం సీఏసీ ఏకగ్రీవంగా ప్రతిపాదించింది.
అనంతరం అగార్కర్ అనుభవం దృష్ట్యా చీఫ్ సెలెక్టర్ పదవికి కూడా సీఏసీ అతని పేరునే సూచించింది. ముంబైకి చెందిన 45 ఏళ్ల అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2007లో ధోని సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో అగార్కర్ సభ్యుడిగా ఉన్నాడు. వన్డేల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాటర్ రికార్డు ఇప్పటికీ అగార్కర్ పేరిటే ఉంది.
2000లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో అగార్కర్ 21 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ప్లేయర్‌గా కెరీర్ ముగిశాక అగార్కర్ ముంబై జట్టు చీఫ్ సెలెక్టర్‌గా, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. క్రికెట్ దిగ్గజం ఒకరు అగార్కర్ పదవి చేపట్టడం వెనుక పావులు కదిపినట్లు తెలుస్తోంది. కాగా, గత కొద్ది రోజులుగా చీఫ్ సెలెక్టర్ జీతం విషయంలో చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. బీసీసీఐలో అత్యున్నత పదవిలో ఉండే వ్యక్తికి కేవలం కోటి రూపాయల జీతం ఉండటంపై చాలా మంది ఈ పదవిపై ఆనాసక్తి చూపారు. డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే కారణంగా చీఫ్ సెలెక్టర్ పోస్ట్‌పై అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం.
భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ: అజిత్ అగార్కర్ (చైర్మన్), శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్.
Comments
Please login to add a commentAdd a comment