selection commitee
-
November 30: భారత క్రికెట్‌కు బిగ్ డే
భారత క్రికెట్‌కు ఇవాళ (నవంబర్ 30) బిగ్ డేగా చెప్పవచ్చు. త్వరలో ప్రారంభంకానున్న సౌతాఫ్రికా పర్యటన కోసం నేడు టీమిండియాను ప్రకటించే అవకాశం ఉంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై నెల పాటు సాగే దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేస్తారు. ఈ సమావేశానికి బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా హాజరయ్యే అవకాశముందని తెలుస్తుంది. వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు స్వస్తి పలుకుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవాల్టి సెలెక్షన్ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రోహిత్, కోహ్లిలను సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేస్తారో లేదోనని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొట్టి క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని భావిస్తున్న రోహిత్‌ను బీసీసీఐ బుజ్జగించిందని సమాచారం. రోహిత్‌ను వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ వరకు కొనసాగేందుకు ఒప్పించారని తెలుస్తుంది. హిట్‌మ్యాన్ సౌతాఫ్రికా పర్యటనకు అందుబాటులో ఉంటాడా లేదా అన్న దానిపై కూడా క్లారిటీ లేదు. మరోవైపు విరాట్ సౌతాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు దూరంగా ఉంటాడని టాక్ వినిపిస్తుంది. ఇకపై విరాట్ కూడా కేవలం టెస్ట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడన్న ప్రచారం కూడా జరుగుతుంది. వన్డే వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్, రాహుల్‌లను టెస్ట్ జట్టుకు ఎంపిక చేస్తారా లేదా అన్నది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. వికెట్‌కీపర్ అవసరం ఉంది కాబట్టి రాహుల్‌కు లైన్ క్లియర్ అయినా.. సీనియర్ రహానేను కాదని శ్రేయస్‌కు అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాలి. అలాగే టీ20 జట్టులో యువ ఆటగాళ్లకు ఏ మేరకు ప్రాధాన్యత లభిస్తుందోనని జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా షెడ్యూల్.. టీ20 సిరీస్.. డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్) డిసెంబర్ 12: రెండో టీ20 (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్బర్గ్) వన్డే సిరీస్.. డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్బర్గ్) డిసెంబర్ 19: రెండో వన్డే (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్) టెస్ట్ సిరీస్.. డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్) 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్) -
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్
ముంబై: భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్‌ను నియమించినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. సెలెక్షన్ ప్యానెల్లో ఖాళీగా ఉన్న ఒక సెలెక్టర్ పదవి కోసం అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం ఇంటర్వ్యూలు చేసింది. చివరకు అగార్కర్ పేరును ఈ పదవి కోసం సీఏసీ ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. అనంతరం అగార్కర్ అనుభవం దృష్ట్యా చీఫ్ సెలెక్టర్ పదవికి కూడా సీఏసీ అతని పేరునే సూచించింది. ముంబైకి చెందిన 45 ఏళ్ల అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2007లో ధోని సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో అగార్కర్ సభ్యుడిగా ఉన్నాడు. వన్డేల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాటర్ రికార్డు ఇప్పటికీ అగార్కర్ పేరిటే ఉంది. 2000లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో అగార్కర్ 21 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ప్లేయర్‌గా కెరీర్ ముగిశాక అగార్కర్ ముంబై జట్టు చీఫ్ సెలెక్టర్‌గా, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. క్రికెట్ దిగ్గజం ఒకరు అగార్కర్ పదవి చేపట్టడం వెనుక పావులు కదిపినట్లు తెలుస్తోంది. కాగా, గత కొద్ది రోజులుగా చీఫ్ సెలెక్టర్ జీతం విషయంలో చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. బీసీసీఐలో అత్యున్నత పదవిలో ఉండే వ్యక్తికి కేవలం కోటి రూపాయల జీతం ఉండటంపై చాలా మంది ఈ పదవిపై ఆనాసక్తి చూపారు. డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే కారణంగా చీఫ్ సెలెక్టర్ పోస్ట్‌పై అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ: అజిత్ అగార్కర్ (చైర్మన్), శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్. -
వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు
2019 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాటి సెలెక్షన్ కమిటీలోని కీలక సభ్యుడితో తనకు మనస్పర్దలు ఉండేవని, అతనితో కలిసి క్రికెట్ ఆడే రోజుల్లో విభేదాలు ఏర్పడ్డాయనని, నన్ను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి అదే కారణం అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ లోకల్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, నాటి జాతీయ సెలెక్టర్లైన ఎంఎస్కే ప్రసాద్ (చీఫ్ సెలెక్టర్), దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్, గగన్ ఖోడా, జతిన్ పరంజపేలు.. అప్పటి ఐపీఎల్ సీజన్లో టాప్ ఫామ్‌లో ఉండిన రాయుడును కాదని త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 2019 వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ వరల్డ్‌కప్‌లో రాయుడు స్థానంలో టీమిండియాకు ఎంపికైన విజయ్ శంకర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ అంశంపై అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. రాయుడు సైతం సెలెక్టర్ల వైఖరిని బహిరంగంగా విమర్శించాడు. ఫామ్‌లో ఉన్న తనను ఎంపిక చేయకపోవడంతో మనస్థాపం చెందిన రాయుడు.. ఉన్నపలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఆ తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నప్పటికీ టీమిండియా అవకాశాలు దక్కలేదు. ఇదిలా ఉంటే, అంబటి రాయుడు ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌కు కూడా వీడ్కోలు పలికేశాడు. సీఎస్కే టైటిల్ గెలిచిన జట్టులో రాయుడు సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవలే అతను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా కలిశాడు. రాయుడు తన రాజకీయ అరంగేట్రం కోసమే ఏపీ సీఎం చుట్టూ తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతుంది. -
రోహిత్ వారసుడు దొరికాడు.. మరి, కోహ్లి తర్వాత ఎవరు..?
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా భవిష్యత్తు తారలు ఎవరంటే..? ఫార్మాట్లకతీతంగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ అహ్మద్, పృథ్వీ షా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్‌ల తదితరుల పేర్లు చెప్పవచ్చు. వీరిలో కొందరికి ప్రస్తుత భారత జట్టు సమీకరణల దృష్ట్యా సరైన అవకాశాలు రానప్పటికీ, భవిష్యత్తులో మాత్రం వీరి స్థానాలకు ఎలాంటి ఢోకా ఉండబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అడపాదడపా వస్తున్న అవకాశాలను ఒడిసి పట్టుకోవడంలో పై పేర్కొన్న ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ ముందు వరుసలో ఉన్నారన్నది కాదనలేని సత్యం. అయితే, వచ్చే నాలుగైదేళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ సీనియర్ క్రికెటర్లు తప్పుకుంటే.. టీమిండియా పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గతకొద్దికాలంగా ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ల ఫామ్‌లను పరిశీలిస్తే, వీరిద్దరు రోహిత్ శర్మ, అశ్విన్ స్థానాలకు తప్పక న్యాయం చేస్తారన్నది సుస్పష్టమవుతోంది. వీరిద్దరి వరకు ఓకే. మరి కోహ్లి, పుజారాల తర్వాత పరిస్థితి ఏంటి..? ఇదే ప్రస్తుతం టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు బీసీసీఐని వేధిస్తున్న ప్రధాన సమస్య. వీరి స్థానాలను మరో మూడు, నాలుగేళ్ల పాటు శ్రేయస్ అయ్యర్ , కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లతో నెట్టుకొచ్చినా, అప్పుడైన ఈ ప్రశ్న మరోసారి తలెత్తుతుంది. ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్లలో (25 ఏళ్ల లోపు) సర్ఫరాజ్ అహ్మద్, పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్ లాంటి ఆటగాళ్లకు కోహ్లి, పుజారా స్థానాలను భర్తీ చేసే సత్తా ఉన్నప్పటికీ.. బీసీసీఐ, సెలక్టర్ల నుంచి వీరికి సరైన సహకారం లభించడం లేదన్నది బహిరంగ రహస్యం. టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నా, శతకాల మోత మోగిస్తున్నా పై పేర్కొన్న నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ దేకను కూడా దేకడం లేదు. ఏదో గడుస్తుంది కదా అన్న ధోరణిలో బీసీసీఐ వ్యవహరిస్తుంది. సరే, దిగ్గజాలు రిటైరయ్యే లోపు ఎవరో ఒకరు దొరుకుతారులే అనుకుంటే చాలామంది టాలెంట్ ఉన్న క్రికెట్ల కెరీర్ల మాదిరే ఈ నలుగురు క్రికెటర్ల కెరీర్లు కూడా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కొందరు ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నా, వివిధ కారణాలను పైకి చూపుతూ వారికి గంపెడు అవకాశాలు కల్పించే సెలెక్టర్లు.. టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు మాత్రం కనీసం ఒకటి రెండు అవకాశాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. దీని ప్రభావం భారత క్రికెట్ భవిష్యత్తుపై పడుతుందని వీరు అంచనా వేయలేకపోతున్నారు. కాబట్టి బీసీసీఐ, సెలెక్టర్లు ఇకనైనా మేల్కొని యువ ఆటగాళ్లను ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తూ, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే భారత క్రికెట్ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. లేకపోతే దిగ్గజాలు ఒక్కసారిగా రిటైరైన తర్వాత వెస్టిండీస్ క్రికెట్‌కు ఏ గతి పట్టిందో, మనకు అదే గతి పడుతుంది. పై పేర్కొన్న నలుగురు, ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే కాక, చాలామంది యంగ్ టాలెంటెడ్ క్రికెటర్లు అవకాశాల కోసం భారత క్రికెట్ బోర్డు వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు మనం కేవలం బ్యాటింగ్ విభాగం ప్రస్తావన మాత్రమే తెచ్చాం. టీమిండియాను చాలాకాలంగా పేస్ బౌలింగ్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల సమస్య వేధిస్తూనే ఉంది. ఈ రెండు విభాగాల వరకు భవిష్యత్తు మాట అటుంచితే, ప్రస్తుత పరిస్థితే ఏమంత ఆశాజనకంగా లేదు. పేసర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ అప్పుడప్పుడూ మెరుస్తున్నా.. గాయాలు, ఏ సిరీస్‌లో ఎవరుంటారో ఎవరిని తప్పిస్తారో చెప్పలేని పరిస్థితి. అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ పేసర్లు ఉన్నా వీరు ఎప్పుడు ఎలా బౌలింగ్ చేస్తారో వారితో సహా ఎవ్వరూ చెప్పలేరు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. హార్ధిక్ మినహా ఈ విభాగంలో గత ఐదారేళ్ల కాలంలో ఒక్క నిఖార్సైన ఆల్‌రౌండర్ దొరకలేదు. శార్ధూల్ ఠాకూర్, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి, ఇస్తూ ఉన్న పెద్ద ప్రయోజనం లేదు. యువ ఆల్‌రౌండర్ శివమ్ మావీ కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాడు. మరిన్ని అవకాశాలు ఇస్తే కానీ ఇతనిలో విషయం ఏంటో చెప్పలేని పరిస్థితి. ఈ విభాగాల్లోనే కాక, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్లపై కూడా ఇప్పటి నుంచే అన్వేషణ మొదలు పెట్టాల్సి ఉంది. -
'బీసీసీఐ బాస్‌ని.. పనికిమాలిన విషయాలు పట్టించుకోను'
కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినప్పటి నుంచి బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో సౌరవ్ గంగూలీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఏదో ఒక అంశం గంగూలీని టార్గెట్ చేస్తూనే ఉంది. తాజాగా బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా సెలెక్షన్ కమిటీ వ్యవహారాల్లో గంగూలీ తలదూరుస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు విరాట్ కోహ్లి, బీసీసీఐ సెక్రటరీ జై షాలతో కలిసి గంగూలీ సమావేశమైన ఫోటో ఒకటి చక్కర్లు కొట్టింది. చదవండి: Australia Tour Of Pakistan: 24 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్ గడ్డపై సిరీస్ ఈ వార్తలను బీసీసీఐ బాస్ గంగూలీ తనదైన శైలిలో తిప్పికొట్టాడు. తాను బీసీసీఐకి బాస్‌నని.. ఇలాంటి తప్పుడు వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదని గంగూలీ ఘూటు విమర్శలు చేశాడు.''నేను బీసీసీఐకి అధ్యక్షుడి హోదాలో ఉన్నా. అలాంటి గొప్ప స్థానంలో ఉన్నా నాకు పిచ్చి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదు. ఒక బీసీసీఐ బాస్‌గా నా పనేంటో తెలుసు. ప్రస్తుతం అదే చేస్తున్నా. సెలక్షన్ కమిటీ మీటింగ్‌లో నా ఫోటోను పెట్టి నిబంధనలు అతిక్రమించాడని ఇష్టమొచ్చినట్లు వార్తలు రాశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలచుకున్నా. సెక్రటరీ జై షా, విరాట్ కోహ్లితో కలిసి ఫోటో దిగినంత మాత్రానా నేను సెలక్షన్ కమిటీ మీటింగ్‌కు హాజరైనట్లు ఎలా చెప్పగలరు. అది బయటో ఎక్కడో కలిసిన సందర్భంలో తీసిన ఫోటో అని భావించొచ్చు కదా.. అయినా ఇలాంటి పిచ్చి ఆరోపణలు నాకు అవసరం లేదు. టీమిండియా తరపున 424 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నాకు రూల్స్ ఏంటనేవి తెలియవా'' అంటూ విరుచుకుపడ్డాడు. చదవండి: Shaik Rasheed: అవరోధాలు అధిగమించి.. మనోడి సూపర్ హిట్టు ఇన్నింగ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. -
సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా యౌరాజ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) 2014-15 సీజన్‌కు పలు సెలక్షన్ కమిటీలకు చైర్మన్లను, వివిధ జట్లకు కోచ్‌లను నియమించింది. సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా యౌరాజ్ సింగ్ వ్యవహరిస్తారు. ఎన్.పి. సింగ్, సి. జయ్‌కుమార్, అరవింద్ శెట్టిలను ఈ కమిటీ సభ్యులుగా హెచ్‌సీఏ నామినేట్ చేసింది. జూనియర్ సెలక్షన్ కమిటీకి జె. శివాజి యాదవ్ చైర్మన్ కాగా, మహ్మద్ ఇఫ్తెకారుద్దీన్, పి. విజయ్ కుమార్, ఇమ్రాన్ మహమూద్ ఇతర సభ్యులు. సబ్ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కిరణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించగా, జి. మనోహర్ రెడ్డి, వినోద్ మఖిజా, టి.కె. నాగరాజు కమిటీ సభ్యులుగా నామినేట్ అయ్యారు. ఇక హైదరాబాద్ ‘ఎ’ జట్టు కోచ్‌గా పి.రమేశ్ కుమార్, అండర్-19 జట్టు కోచ్‌గా విద్యుత్ జైసింహ, అండర్-16 జట్టు కోచ్‌గా చేతన్ ఆనంద్, అండర్-14 జట్టు కోచ్‌గా తిమోతి రవికుమార్ నియమితులయ్యారు.