2019 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాటి సెలెక్షన్ కమిటీలోని కీలక సభ్యుడితో తనకు మనస్పర్దలు ఉండేవని, అతనితో కలిసి క్రికెట్ ఆడే రోజుల్లో విభేదాలు ఏర్పడ్డాయనని, నన్ను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి అదే కారణం అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ లోకల్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు ఈ మేరకు వ్యాఖ్యానించాడు.
కాగా, నాటి జాతీయ సెలెక్టర్లైన ఎంఎస్‌కే ప్రసాద్ (చీఫ్ సెలెక్టర్), దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్, గగన్ ఖోడా, జతిన్ పరంజపేలు.. అప్పటి ఐపీఎల్ సీజన్‌లో టాప్ ఫామ్‌లో ఉండిన రాయుడును కాదని త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 2019 వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఆ వరల్డ్‌కప్‌లో రాయుడు స్థానంలో టీమిండియాకు ఎంపికైన విజయ్ శంకర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ అంశంపై అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. రాయుడు సైతం సెలెక్టర్ల వైఖరిని బహిరంగంగా విమర్శించాడు. ఫామ్‌లో ఉన్న తనను ఎంపిక చేయకపోవడంతో మనస్థాపం చెందిన రాయుడు.. ఉన్నపలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఆ తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నప్పటికీ టీమిండియా అవకాశాలు దక్కలేదు.
ఇదిలా ఉంటే, అంబటి రాయుడు ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌కు కూడా వీడ్కోలు పలికేశాడు. సీఎస్‌కే టైటిల్ గెలిచిన జట్టులో రాయుడు సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవలే అతను ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కూడా కలిశాడు. రాయుడు తన రాజకీయ అరంగేట్రం కోసమే ఏపీ సీఎం చుట్టూ తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment