BCCI should eye on future team India: Gill, Sundar advance in race - Sakshi
Sakshi News home page

రోహిత్‌ వారసుడు దొరికాడు.. మరి, కోహ్లి తర్వాత ఎవరు..?

Published Thu, Feb 2 2023 4:06 PM | Last Updated on Thu, Feb 2 2023 4:50 PM

BCCI Should Eye On Future Team India.. Gill, Sunder Advance In Race - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా భవిష్యత్తు తారలు ఎవరంటే..? ఫార్మాట్లకతీతంగా శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, పృథ్వీ షా, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ మావి, ఉమ్రాన్‌ మాలిక్‌, రవి బిష్ణోయ్‌ల తదితరుల పేర్లు చెప్పవచ్చు. వీరిలో కొందరికి ప్రస్తుత భారత జట్టు సమీకరణల దృష్ట్యా సరైన అవకాశాలు రానప్పటికీ, భవిష్యత్తులో మాత్రం వీరి స్థానాలకు ఎలాంటి ఢోకా ఉండబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం అడపాదడపా వస్తున్న అవకాశాలను ఒడిసి పట్టుకోవడంలో పై పేర్కొన్న ఆటగాళ్లలో శుభ్‌మన్‌ గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ముందు వరుసలో ఉన్నారన్నది కాదనలేని సత్యం. అయితే, వచ్చే నాలుగైదేళ్లలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, చతేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్‌ అశ్విన్‌ వంటి స్టార్‌ సీనియర్‌ క్రికెటర్లు తప్పుకుంటే.. టీమిండియా పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

గతకొద్దికాలంగా ఓపెనర్‌గా శుభ్‌మన్‌ గిల్‌, ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్‌ సుందర్‌ల ఫామ్‌లను పరిశీలిస్తే, వీరిద్దరు రోహిత్‌ శర్మ, అశ్విన్‌ స్థానాలకు తప్పక న్యాయం చేస్తారన్నది సుస్పష్టమవుతోంది. వీరిద్దరి వరకు ఓకే. మరి కోహ్లి, పుజారాల తర్వాత పరిస్థితి ఏంటి..? ఇదే ప్రస్తుతం టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు బీసీసీఐని వేధిస్తున్న ప్రధాన సమస్య. వీరి స్థానాలను మరో మూడు, నాలుగేళ్ల పాటు శ్రేయస్‌ అయ్యర్‌ , కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ లాంటి ఆటగాళ్లతో నెట్టుకొచ్చినా, అప్పుడైన ఈ ప్రశ్న మరోసారి తలెత్తుతుంది.

ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్లలో (25 ఏళ్ల లోపు) సర్ఫరాజ్‌ అహ్మద్‌, పృథ్వీ షా, రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌ లాంటి ఆటగాళ్లకు కోహ్లి, పుజారా స్థానాలను భర్తీ చేసే సత్తా ఉన్నప్పటికీ.. బీసీసీఐ, సెలక్టర్ల నుంచి వీరికి సరైన సహకారం లభించడం లేదన్నది బహిరంగ రహస్యం. టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నా, శతకాల మోత మోగిస్తున్నా పై పేర్కొన్న నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ దేకను కూడా దేకడం లేదు. ఏదో గడుస్తుంది కదా అన్న ధోరణిలో బీసీసీఐ వ్యవహరిస్తుంది.

సరే, దిగ్గజాలు రిటైరయ్యే లోపు ఎవరో ఒకరు దొరుకుతారులే అనుకుంటే చాలామంది టాలెంట్‌ ఉన్న క్రికెట్ల కెరీర్‌ల మాదిరే ఈ నలుగురు క్రికెటర్ల కెరీర్లు కూడా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కొందరు ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నా, వివిధ కారణాలను పైకి చూపుతూ వారికి గంపెడు అవకాశాలు కల్పించే సెలెక్టర్లు.. టాలెంట్‌ ఉన్న ఆటగాళ్లకు మాత్రం కనీసం ఒకటి రెండు అవకాశాలు కూడా ఇవ్వలేకపోతున్నారు.

దీని ప్రభావం భారత క్రికెట్‌ భవిష్యత్తుపై పడుతుందని వీరు అంచనా వేయలేకపోతున్నారు. కాబట్టి బీసీసీఐ, సెలెక్టర్లు ఇకనైనా మేల్కొని యువ ఆటగాళ్లను ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తూ, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే భారత క్రికెట్‌ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. లేకపోతే దిగ్గజాలు ఒక్కసారిగా రిటైరైన తర్వాత వెస్టిండీస్‌ క్రికెట్‌కు ఏ గతి పట్టిందో, మనకు అదే గతి పడుతుంది. పై పేర్కొన్న నలుగురు, ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే కాక, చాలామంది యంగ్‌ టాలెంటెడ్‌ క్రికెటర్లు అవకాశాల కోసం భారత క్రికెట్‌ బోర్డు వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటివరకు మనం కేవలం బ్యాటింగ్‌ విభాగం ప్రస్తావన మాత్రమే తెచ్చాం. టీమిండియాను చాలాకాలంగా పేస్‌ బౌలింగ్‌, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల సమస్య వేధిస్తూనే ఉంది. ఈ రెండు విభాగాల వరకు భవిష్యత్తు మాట అటుంచితే, ప్రస్తుత పరిస్థితే ఏమంత ఆశాజనకంగా లేదు. పేసర్లలో బుమ్రా, షమీ, సిరాజ్‌ అప్పుడప్పుడూ మెరుస్తున్నా.. గాయాలు, ఏ సిరీస్‌లో ఎవరుంటారో ఎవరిని తప్పిస్తారో  చెప్పలేని పరిస్థితి. అర్షదీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి యువ పేసర్లు ఉన్నా  వీరు ఎప్పుడు ఎలా బౌలింగ్‌ చేస్తారో వారితో సహా ఎవ్వరూ చెప్పలేరు.

పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. హార్ధిక్‌ మినహా ఈ విభాగంలో గత ఐదారేళ్ల కాలంలో  ఒక్క నిఖార్సైన ఆల్‌రౌండర్‌ దొరకలేదు.  శార్ధూల్‌ ఠాకూర్‌, విజయ్‌ శంకర్‌ లాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి, ఇస్తూ ఉన్న పెద్ద ప్రయోజనం లేదు. యువ ఆల్‌రౌండర్‌ శివమ్‌ మావీ కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాడు. మరిన్ని అవకాశాలు ఇస్తే కానీ ఇతనిలో విషయం ఏంటో చెప్పలేని పరిస్థితి.  ఈ విభాగాల్లోనే కాక, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు, వికెట్‌ కీపర్లపై కూడా ఇప్పటి నుంచే అన్వేషణ మొదలు పెట్టాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement