భారత క్రికెట్‌కు ఇవాళ (నవంబర్ 30) బిగ్ డేగా చెప్పవచ్చు. త్వరలో ప్రారంభంకానున్న సౌతాఫ్రికా పర్యటన కోసం నేడు టీమిండియాను ప్రకటించే అవకాశం ఉంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై నెల పాటు సాగే దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేస్తారు. ఈ సమావేశానికి బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా హాజరయ్యే అవకాశముందని తెలుస్తుంది.
వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు స్వస్తి పలుకుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవాల్టి సెలెక్షన్ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రోహిత్, కోహ్లిలను సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేస్తారో లేదోనని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొట్టి క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని భావిస్తున్న రోహిత్‌ను బీసీసీఐ బుజ్జగించిందని సమాచారం.
రోహిత్‌ను వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ వరకు కొనసాగేందుకు ఒప్పించారని తెలుస్తుంది. హిట్‌మ్యాన్ సౌతాఫ్రికా పర్యటనకు అందుబాటులో ఉంటాడా లేదా అన్న దానిపై కూడా క్లారిటీ లేదు. మరోవైపు విరాట్ సౌతాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు దూరంగా ఉంటాడని టాక్ వినిపిస్తుంది. ఇకపై విరాట్ కూడా కేవలం టెస్ట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడన్న ప్రచారం కూడా జరుగుతుంది.
వన్డే వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్, రాహుల్‌లను టెస్ట్ జట్టుకు ఎంపిక చేస్తారా లేదా అన్నది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. వికెట్‌కీపర్ అవసరం ఉంది కాబట్టి రాహుల్‌కు లైన్ క్లియర్ అయినా.. సీనియర్ రహానేను కాదని శ్రేయస్‌కు అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాలి. అలాగే టీ20 జట్టులో యువ ఆటగాళ్లకు ఏ మేరకు ప్రాధాన్యత లభిస్తుందోనని జనం ఆసక్తిగా గమనిస్తున్నారు.
సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా షెడ్యూల్..
టీ20 సిరీస్..
- డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్)
- డిసెంబర్ 12: రెండో టీ20 (పోర్ట్ ఎలిజబెత్)
- డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్‌బర్గ్)
వన్డే సిరీస్..
- డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్‌బర్గ్)
- డిసెంబర్ 19: రెండో వన్డే (పోర్ట్ ఎలిజబెత్)
- డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్)
టెస్ట్ సిరీస్..
- డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్)
- 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్)
Comments
Please login to add a commentAdd a comment