సిడ్నీ:ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ తన టెస్టు కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. 12వేల టెస్టు పరుగులు సాధించిన క్లబ్‌లో కుక్ తాజాగా చేరిపోయాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కుక్ 10 పరుగుల్ని చేయడం ద్వారా పన్నెండు వేల టెస్టు పరుగుల్ని సాధించాడు. తద్వారా 12 వేలు, అంతకుపైగా పరుగులు సాధించిన దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్(15,921), రికీ పాంటింగ్(13,378), జాక్వస్ కల్లిస్(13,289), కుమార సంగక్కార(12,400)ల సరసన కుక్ స్థానం సంపాదించాడు.
యాషెస్ సిరీస్ నాల్గో టెస్టులో కుక్ అజేయంగా 244 పరుగులు సాధించాడు. దాంతో ఒక టెస్టు మ్యాచ్ లో ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించి కడవరకూ అజేయంగా నిలవడమే కాకుండా అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. తద్వారా 45 ఏళ్ల రికార్డును కుక్ బ్రేక్ చేశాడు. అంతకుముందు 1972లో న్యూజిలాండ్ ఓపెనర్ గ్లెన్ టర్నర్స్(223 నాటౌట్) ఓపెనర్ గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయగా, ఆపై దాన్ని కుక్ సవరించాడు.
ఇదిలా ఉంచితే, చివరిటెస్టు తొలి ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా 649/7 వద్ద డిక్లేర్ చేసింది. అటు తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 93పరుగులు చేసింది. జోరూట్(42;124 బంతుల్లో), బెయిర్ స్టో(17 బ్యాటింగ్; 45 బంతుల్లో 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంకా ఇంగ్లండ్ 210 పరుగులు వెనుకబడి ఉంది. దాంతో సోమవారం ఆఖరి రోజు ఆటను ఇంగ్లండ్ పూర్తిగా ఆడితేనే ఓటమి నుంచి తప్పించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment