అలెస్టర్ కుక్ మరో రికార్డు
చెన్నై: ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా భారత్తో ఇక్కడ జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో కుక్ 11వేల పరుగుల మార్కును చేరాడు. తద్వారా ఈ ఫార్మాట్లో తక్కువ సమయంలో పదకొండు వేలు పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ పరుగుల్ని కుక్ 10 సంవత్సరాల 290 రోజుల్లోనే సాధించి రికార్డు సృష్టించాడు. అంతకుముందు టెస్టు ఫార్మాట్లో పదకొండు వేల పరుగుల మైలురాయిని ఇంత తక్కువ సమయంలో చేరుకున్న ఆటగాడు లేడు.
ఈ మ్యాచ్ కు ముందు 10,998 పరుగులతో ఉన్న కుక్.. ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు పరుగులు చేయడం ద్వారా పదకొండ వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. అయితే ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 10 పరుగులు చేసి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. కుక్ 140 మ్యాచ్ల్లో 252 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనతను సాధించాడు. ఇందులో 30 శతకాలు, 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ ఏడాది మేలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫాస్టెస్ట్ పదివేల పరుగుల రికార్డును కుక్ అధిగమించిన సంగతి తెలిసిందే. పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు కాగా, కుక్ 31 ఏళ్ల 4 నెలల వయసులోనే ఆ మార్కును చేరాడు. కాగా, పదకొండ వేల పరుగులను చేరుకునే క్రమంలో సచిన్ కు 223 ఇన్నింగ్స్ లు మాత్రమే అవసరమయ్యాయి. కాకపోతే సచిన్ ఈ మార్కును చేరడానికి దాదాపు 18 ఏళ్లు పట్టింది.