
కొత్త వ్యూహంతో బరిలోకి దిగుతాం: కుక్
మొహాలి: తొలి టెస్టులో సాధారణ ప్రదర్శనతో వెనుకంజ వేసినట్లు కనిపించిన టీమిండియా రెండో టెస్టు, మూడో టెస్టులో మాత్రం ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్‌లోనూ రాణించి 8 వికెట్ల తేడాతో మూడో టెస్టులో విరాట్ కోహ్లీ సేన విజయాన్ని సాధించింది. ఈ టెస్ట్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ స్పందించాడు. తమ బ్యాట్స్‌మన్ పిచ్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని చెప్పాడు. తమ ఓటమికి ఇది కూడా ఓ కారణమని అభిప్రాయపడ్డాడు. తర్వాతి టెస్టులో భారత్‌కు ముకుతాడు వేయాలంటే ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగుతామన్నాడు.
సీనియర్ స్పిన్నర్ గరెత్ బ్యాటీ వికెట్లు తీయకపోవడంతో పాటు అసలు భారత బ్యాట్స్‌మన్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదని కుక్ చెప్పాడు. ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌తో బెన్ స్టోక్స్ రాణించడం ఒక్కటే తమకు ప్లస్ పాయింట్ అన్నాడు. లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఈ టెస్టులో ఐదు వికెట్లతో రాణించాడు. ఇదే స్టేడియంలో గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 20 వికెట్లకుగానూ 19 వికెట్లు స్పిన్నర్లే తీసి భారత విజయంలో కీలక పోషించారని అలెస్టర్ కుక్ గుర్తుచేశాడు. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల వ్యూహంతో ఇప్పటివరకూ ఆడాం.. కానీ వచ్చే మ్యాచ్‌లో మరో స్పిన్నర్‌కు అవకాశం కల్పించి టీమిండియాను త్వరగా ఆలౌట్ చేస్తే తమకు విజయావకాశాలు ఉంటాయని మ్యాచ్ అనంతంరం ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ వివరించాడు.