8 సీజన్ల తర్వాత... | All you need to know about the 2 new IPL teams | Sakshi
Sakshi News home page

8 సీజన్ల తర్వాత...

Published Tue, Dec 15 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

8 సీజన్ల తర్వాత...

8 సీజన్ల తర్వాత...

* ఐపీఎల్‌లో మరో జట్టుకు అందుబాటులో ధోని
* పది మంది ఆటగాళ్లను నేడు ఎంచుకోనున్న పుణే, రాజ్‌కోట్


ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2008లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్. తొలి సీజన్‌లో అందరికంటే ఎక్కువ మొత్తం వెచ్చించి ధోనిని సొంతం చేసుకున్న చెన్నై... ప్రతి ఏటా అతణ్ని  కొనసాగించుకుంది.

ఎనిమిది సీజన్ల తర్వాత ధోని మళ్లీ వేరే జట్టుకు ఇంతకాలానికి అందుబాటులోకి వచ్చాడు. చెన్నై, రాజస్తాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో వచ్చిన కొత్త జట్లు పుణే, రాజ్‌కోట్... నేడు పదిమంది క్రికెటర్లను ఎంచుకోనున్నాయి. చెన్నై, రాజస్తాన్ జట్లకు గత సీజన్‌లో ఆడిన మొత్తం 50 మంది క్రికెటర్లు అందుబాటులో ఉండగా... ఈ రెండు జట్లు ఐదుగురేసి ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ధోని, అశ్విన్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, బ్రెండన్ మెకల్లమ్, అజింక్య రహానే, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, డ్వేన్ బ్రే వో, డ్వేన్ స్మిత్‌ల మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
 
పుణేకు తొలి అవకాశం

నేడు జరిగే ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో తొలి క్రికెటర్‌ను ఎంచుకునే అవకాశం పుణే జట్టుకు ఉంది. సంజీవ్ గోయెంకాకు చెందిన కంపెనీ రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియలో మైనస్ 16 కోట్ల రూపాయలతో జట్టును పుణేను గెలిచింది. రాజ్‌కోట్‌ను కొనుక్కున్న ఇంటెక్స్ మొబైల్స్ (మైనస్ 10 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ మొత్తం పుణే జట్టు చెల్లిస్తోంది. కాబట్టి తొలి ఆటగాడిని పుణే ఎంచుకుంటే, రెండో క్రికెటర్‌ను రాజ్‌కోట్ తీసుకుంటుంది.

ఆ తర్వాత పుణే, తిరిగి రాజ్‌కోట్ ఇలా ఆటగాళ్లను తీసుకుంటారు. పది మంది పూర్తయ్యాక... మిగిలిన 40 మంది క్రికెటర్లు ఫిబ్రవరిలో జరిగే వేలంలోకి వెళతారు. అక్కడ వీరితో పాటు మరింత మంది క్రికెటర్లు ఉంటారు. ఆ వేలంలో అన్ని జట్లూ పాల్గొంటాయి.
 
జడేజాపై రాజ్‌కోట్ దృష్టి

అందుబాటులో ఉన్న వారిలో అందరికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఆటగాడు ధోని. కాబట్టి సహజంగానే ధోనిని పుణే తీసుకోవచ్చు. అయితే రాజ్‌కోట్ జట్టు తమ తొలి ఆటగాడిగా జడేజాను ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో జడేజా విశేషంగా రాణించడంతో పాటు... అతను రాజ్‌కోట్‌కే చెందిన వాడు కావడంతో తొలుత ఈ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని భావిస్తున్నారు. మొత్తం మీద ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఆడిన ఆటగాళ్లలో కొందరు ఇప్పుడు రెండు వేరు వేరు జట్లకు ఆడాల్సి వస్తుంది.
 
కొత్త జట్టు ఆటగాళ్ల కోసం కనిష్టంగా రూ.40 కోట్లు, గరిష్టంగా రూ.60 కోట్లు ఖర్చు చేయాలి. నేడు జరిగే ఎంపిక ప్రక్రియలో తొలి క్రికెటర్‌ను తీసుకోగానే ఇందులో నుంచి రూ.12.5 కోట్లు తగ్గిపోతాయి. ఆ తర్వాత నలుగురు క్రికెటర్లను తీసుకోగానే వరుసగా రూ.9.5 కోట్లు, రూ.7.5 కోట్లు, రూ.5.5 కోట్లు, రూ.4 కోట్లు తగ్గిపోతాయి. ఫిబ్రవరిలో జరిగే వేలంలో ఈ మొత్తాన్ని తగ్గించుకుని మిగిలిన ఆటగాళ్లను కొనుక్కోవాలి.
 
డిసెంబరు 31 వరకు ట్రాన్స్‌ఫర్ విండో
 ప్రతి ఏటా వివిధ జట్లు తమకు అవసరం లేని ఆటగాళ్లను వదిలేస్తాయి. వీళ్లని వేరే ఫ్రాంచైజీ ట్రాన్స్‌ఫర్ విండోలో కొనుక్కోవచ్చు. ఈసారి ట్రాన్స్‌ఫర్ విండో డిసెంబరు 15 నుంచి 31 వరకు ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement