టీమిండియాను ఆదుకున్న రాయుడు
అంబటి రాయుడు సెంచరీ
హాఫ్ సెంచరీతో అండగా నిలిచిన బిన్నీ
జింబాబ్వే లక్ష్యం 256
హారారే: జింబాబ్వే పర్యటనలో తెలుగుతేజం అంబటి రాయుడు అదరగొట్టాడు. ఇతర టాపార్డర్ బ్యాట్స్మెన్ విఫలమైనా రాయుడు (124 నాటౌట్) సెంచరీతో కదంతొక్కి, బిన్నీతో కలసి టీమిండియాను ఆదుకున్నాడు. స్టువర్ట్ బిన్ని (77) హాఫ్ సెంచరీతో రాణించి రాయుడికి అండగా నిలిచాడు. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత్ 256 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాయుడు, బిన్నీతో పాటు కెప్టెన్ రహానె (34) రాణించాడు.
ఓ దశలో టీమిండియా 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ మురళీ విజయ్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ రహానె, అంబటి రాయుడు జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద రహానె అవుటవడంతో టీమిండియా కష్టాల్లోపడింది. మనోజ్ తివారి (2), రాబిన్ ఊతప్ప (0), కేదార్ జాదవ్ (5) వెంటవెంటనే అవుటయ్యారు. ఈ దశలో మరో వికెట్ పడుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే రాయుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. రాయుడుకు స్టువర్ట్ బిన్నీ మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జట్టు స్కోరును 200 దాటించారు. ఈ క్రమంలో రాయుడు 117 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్తో సెంచరీ చేశాడు. వన్డేల్లో రాయుడికిది రెండో సెంచరీ. రాయుడు, బిన్నీ ఆరో వికెట్కు 160 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో బిన్నీ వెనుదిరిగినా, రాయుడు అజేయంగా నిలిచి జట్టు స్కోరును 250 మార్క్ దాటించాడు.