
అంబటి రాయుడు
దుబాయ్: ఆసియా కప్ టోర్నీకి విరాట్ కోహ్లి దూరమైనా... అత్యంత అనుభవజ్ఞుడు మహేంద్ర సింగ్ ధోని అండతో భారత జట్టు మంచి ఫలితాలు సాధిస్తుందని బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు విశ్వాసం వ్యక్తం చేశాడు. గతంలోనూ ధోని తమను నడిపించిన విషయాన్ని అతను గుర్తు చేశాడు. ‘కోహ్లి లేకపోవడం లోటే. అయితే విజయాలు సాధించగల నైపుణ్యం ఈ జట్టుకు ఉంది. ధోని కెప్టెన్‌గా పని చేశాడు. జట్టులో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా అండగా నిలిచేందుకు అతను సిద్ధంగా ఉంటాడు. వ్యక్తిగతంగా చూసినా ఈ సీజన్‌లో నేను మళ్లీ కోలుకొని బాగా ఆడేందుకు అతను ఎంతో సహకరించాడు’ అని రాయుడు పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన తర్వాత కూడా యో యో టెస్టులో విఫలం కావడంతో స్థానం కోల్పోయిన రాయుడు... ఇప్పుడు యో యోలో పాస్ అయి మళ్లీ చోటు దక్కించుకున్నాడు.
‘ఇంగ్లండ్ టూర్‌కు దూరం కావడం సహజంగానే అసహనానికి గురి చేసింది. అయితే ఆసియా కప్‌కు తిరిగి రావడం సంతోషంగా ఉంది. ఈసారి ఐపీఎల్‌లో చాలా బాగా ఆడాను. ఫిట్‌గా ఉన్నంత వరకు వయసు అడ్డంకి కాబోదు’ అని 32 ఏళ్లు రాయుడు వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆసియా కప్‌పైనే అందరి దృష్టి ఉందని, వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ గురించి, మిడిలార్డర్‌లో తన స్థానం గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదని అతను స్పష్టం చేశాడు. ‘మిడిలార్డర్‌లో పోటీ ఉందని భావించడం లేదు. నా సత్తా నిరూపించుకునేందుకు దీనిని మంచి అవకాశంగా భావిస్తున్నా. అయితే ఇలా ఆలోచించి నాపై ఒత్తిడి పెంచుకోను. నేనే కాదు జట్టులో ఎవరికీ ప్రస్తుతం వరల్డ్ కప్ గురించి ఆలోచన లేదు’ అని రాయుడు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment