అమ్మాన్ (జోర్డాన్): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ... భారత అగ్రశ్రేణి బాక్సర్లు అమిత్ పంఘాల్ (52 కేజీలు), మేరీకోమ్ (51 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో ఈ ముగ్గురూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అమిత్ పంఘాల్ 4–1తో కార్లో పాలమ్ (ఫిలిప్పీన్స్)ను ఓడించగా... మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, 37 ఏళ్ల మణిపూర్ మెరిక మేరీకోమ్ 5–0తో ఇరిష్ మాగ్నో (ఫిలిప్పీన్స్)పై... పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రన్‌జిత్ 5–0తో రెండో సీడ్ నమున్ మోన్‌ఖోర్ (మంగోలియా)పై ఘనవిజయం సాధించారు.
సిమ్రన్‌జిత్ తొలిసారి ఒలింపిక్ బెర్త్ దక్కించుకోగా... మేరీకోమ్ రెండోసారి ఒలింపిక్స్ బరిలో నిలువనుంది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్ బెర్త్ దక్కించుకోవడంతో ఇదే వెయిట్ కేటగిరీలో ఉన్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఒలింపిక్ ఆశలు ఆవిరయ్యాయి. ఒకవేళ మేరీకోమ్ ఓడిపోయుంటే మే నెలలో పారిస్‌లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ రూపంలో నిఖత్‌కు అవకాశం మిగిలి ఉండేది. సోమవారమే జరిగిన మరో రెండు క్వార్టర్ ఫైనల్ బౌట్స్‌లో భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. పురుషుల విభాగం 63 కేజీల కేటగిరీలో మనీశ్ కౌశిక్ 2–3తో చిన్‌జోరింగ్ బాటర్‌సుక్ (మంగోలియా) చేతిలో... మహిళల విభాగం 57 కేజీల కేటగిరీలో సాక్షి 0–5తో ఇమ్ ఏజి (కొరియా) చేతిలో ఓడిపోయారు. ఓవరాల్‌గా ఈ టోర్నీ ద్వారా భారత్ నుంచి ఏకంగా ఎనిమిది మంది బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment