హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ 12లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ ద్వారా ఔటయ్యాడు. ఐపీఎల్‌లో ఇలా ఔటైన రెండో ఆటగాడిగా మిశ్రా నిలిచాడు. ఐపీఎల్ 2013లో రాంచీ వేదికగా పుణే వారియర్స్‌తో జరుగిన మ్యాచ్‌లో అప్పటి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు యుసఫ్ పఠాన్ కూడా సరిగ్గా ఇలానే పెవిలియన్‌కు చేరాడు. ఇక మిశ్రా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఈ వెటరన్ ఆటగాడు ప్రవర్తించాడని కొందరు కామెంట్ చేశారు. పరిగెత్తేప్పుడు మిశ్రా గూగ్లీకి ప్రయత్నించాడని మరికొందరు చమత్కరించారు.
అసలేం జరిగిందంటే..
ఢిల్లీ క్యాపిటల్స్-సన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో రసవత్తర డ్రామా నడిచింది. 3 బంతుల్లో 2 పరుగులు అవసరమైన స్థితిలో ఖలీల్ బంతికి షాట్ ఆడబోయి విఫలమయ్యాడు అమిత్ మిశ్రా. బంతి బీట్ అయ్యాక అతను పరుగందుకున్నాడు. వికెట్ కీపర్ సాహా బంతిని స్టంప్స్‌కు కొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. పిచ్ మధ్యలో ఉన్న ఖలీల్ బంతిని అందుకుని నాన్-స్ట్రైకింగ్ వైపున్న స్టంప్స్ కొట్టబోయాడు. ఐతే మిశ్రా ఈ సంగతి గమనించి ఉన్నట్లుండి తన దారి మార్చుకున్నాడు. స్టంప్స్‌కు అడ్డంగా పరుగెత్తే ప్రయత్నం చేశాడు. దీంతో ఖలీల్ విసిరిన బంతి అతడికే తాకింది. దీనిపై ఖలీల్ సమీక్ష కోరాడు. మూడో అంపైర్ రీప్లే చూసి మిశ్రా ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డం పడ్డాడని నిర్ధరించి.. ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కింద అతడిని ఔట్‌గా ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment