అమిత్ మిశ్రా అదుర్స్
బసెటెర్రె (సెయింట్ కిట్స్): స్పిన్నర్ అమిత్ మిశ్రా సత్తా చాటడంతో వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ను టీమిండియా డ్రా చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజును భారత్ ఆరు వికెట్లకు 258 పరుగుల వద్ద ముగించింది. ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (50), శిఖర్ ధావన్ (51)కు తోడు రోహిత్ శర్మ (54 నాటౌట్; 8 ఫోర్లు; 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలతో రాణించాడు.
తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్ 87 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. షాయి హోప్(118) సెంచరీ సాధించాడు. రాజేంద్ర చంద్రిక(69), వారికన్(50) అర్ధసెంచరీలతో రాణించారు. మిగతా బ్యాట్స్మెన్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టాడు. 27 ఓవరల్లో 67 పరుగులిచ్చి 4 వికెట్లు నేలకూల్చాడు. భువనేశ్వర్ కుమార్, షమీ, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు.