సంజూ శాంసన్.. ఈ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో తగినన్ని అవకాశాలు రావడం లేదనేది అతడి అభిమానుల వాదన. ప్రతిభ ఉన్నా ఈ కేరళ ఆటగాడి పట్ల సెలక్టర్లు వివక్ష చూపుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అందుకు తగ్గట్లుగానే వన్డే ప్రపంచకప్-2023 సమయంలో మెరుగైన గణాంకాలున్న సంజూను కాదని.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు ఇచ్చారు. అందుకు తగ్గ మూల్యం కూడా చెల్లించారు.
ఈ టోర్నీలో సూర్య పూర్తిగా తేలిపోవడంతో జట్టు యాజమాన్యం విమర్శలపాలైంది. ఈ క్రమంలో ఐపీఎల్-2024 రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాటర్‌గా సత్తా చాటిన సంజూ ఎట్టకేలకు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.
అయితే, రిషభ్ పంత్ రూపంలో గట్టి పోటీ ఎదురుకావడంతో అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం జింబాబ్వే పర్యటనలో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన సంజూకు.. తదుపరి శ్రీలంక టూర్‌కు వెళ్లబోయే జట్టులో చోటు దక్కుతుందో లేదోనన్నది ఆసక్తికరంగా మారింది.
వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంజూ శాంసన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. శుభంకర్ మిశ్రా యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో అమిత్ మిశ్రా టీ20 ప్రపంచకప్-2026 జట్టులో సంజూకు చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
‘‘అతడు మరో వరల్డ్‌కప్ ఆడతాడని నేను అనుకోవడం లేదు. ఇప్పటికే అతడికి వయసు మీద పడింది. టీ20 జట్టులో యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తామనే సంప్రదాయాన్ని విరాట్ కోహ్లి ప్రవేశపెట్టాడు.
వాళ్లే బాగా ఆడతారని అతడి నమ్మకం. అయితే, తనకు 35 ఏళ్లు వచ్చినా కోహ్లి ఆడాడనుకోండి. అది వేరే విషయం. ఒకవేళ శాంసన్ గనుక టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే అత్యద్భుతంగా ఆడాలి.
వారి నుంచి తీవ్రమైన పోటీ
అలా అయితే, రెండేళ్ల తర్వాత జరిగే ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు దక్కుతుంది. లేదంటే కష్టమే. నిజానికి ఇషాన్ కిషన్ అత్యంత ప్రతిభ ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్.
కానీ అతడిని టీ20ల నుంచి పక్కనపెట్టేశారు. ఇక రిషభ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అతడొక అత్యుత్తమ ప్లేయర్. ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మ.. ఇలా వికెట్ కీపర్ల లిస్టు పెద్దగానే ఉంది. కాబట్టి సంజూ శ్రమించక తప్పదు’’ అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.
కాగా 29 ఏళ్ల సంజూ శాంసన్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడి 510 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 28 అంతర్జాతీయ టీ20లలో సంజూ 444 రన్స్ సాధించాడు.
చదవండి: హార్దిక్ పాండ్యాకు షాక్!.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే!
Comments
Please login to add a commentAdd a comment