
ఎకతేరిన్‌బర్గ్ (రష్యా): ఆసియా చాంపియన్ అమిత్ పంగల్ ‘పంచ్’ అదిరింది. బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ స్టార్ బాక్సర్ అడుగు క్వార్టర్ ఫైనల్లో పడింది. ఇతనితో పాటు మనీశ్ కౌశిక్, సంజీత్, కవీందర్ సింగ్ బిష్త్‌లు కూడా క్వార్టర్స్ చేరారు. మరో విజయం సాధిస్తే ఈ నలుగురికి కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మంగళవారం జరిగిన 52 కేజీల విభాగంలో ఆసియా స్వర్ణ విజేత, రెండో సీడ్ అమిత్ 5–0తో టర్కీ బాక్సర్ బటుహన్ సిట్‌ఫిసీను కంగుతినిపించాడు. రెండేళ్ల క్రితం జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ (2017)లో క్వార్టర్ ఫైనల్లో ఓడిన అమిత్ ఈసారి పతకం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు.
తొలిసారి ప్రపంచ ఈవెంట్ బరిలో పాల్గొంటున్న మనీశ్ కౌశిక్ (63 కేజీలు) 5–0తో నాలుగో సీడ్ చిన్‌జోరిగ్ బాటర్సుక్ (మంగోలియా)ను బోల్తా కొట్టించగా... సంజీత్ (91 కేజీలు) 3–2తో రెండో సీడ్ సంజార్ తుర్సునోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, కవీందర్ సింగ్ బిష్త్ 3–2తో అర్‌స్లాన్ ఖతయెవ్ (ఫిన్‌లాండ్)పై సంచలన విజయాలు సాధించారు. ఈ నలుగురు భారత ఆర్మీకి చెందిన బాక్సర్లు కావడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో అమిత్... ఫిలిప్పీన్స్‌కు చెందిన కార్లో పాలమ్‌తో, వాండర్సన్ డి ఒలివిరా (బ్రెజిల్)తో మనీశ్... ఏడో సీడ్ జులియో సెసా క్యాస్టిలో (ఈక్వెడార్)తో సంజీత్ తలపడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment