
రెండో టెస్టు నాటికి అండర్సన్!
రాజ్కోట్: ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ తో విశాఖ పట్టణంలో జరుగనున్న రెండో టెస్టు నాటికి ఇంగ్లండ్ ప్రధాన పేసర్ అండర్సన్ జట్టులో చేరే అవకాశం ఉంది. గత కొంతకాలంగా కుడి భుజం గాయంతో బాధపడుతున్న అండర్సన్..ఇటీవల నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షలో పాసయ్యాడు. తాను రెండో టెస్టు నాటికి జట్టుతో కలిసే అవకాశం ఉందని అండర్సన్ తెలిపాడు.
అయితే రెండు, మూడు రోజుల్లో తాను భారత్ కు ఎప్పుడే వెళ్లేది అనే అంశంపై స్పష్టత రానున్నట్లు పేర్కొన్నాడు. తన ఫిట్ నెస్ను చూస్తే తాను మొదటి నాలుగు టెస్టులకు అందుబాటులో ఉండనని అనిపించినా, త్వరగా గాయం నుంచి కోలుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. భారత్ తో సిరీస్ లో భాగంగా తొలి టెస్టు ద్వారా వందవ టెస్టు ఆడుతున్న సహచర బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ను అండర్సన్ అభినందించాడు. బ్రాడ్ చారిత్రక టెస్టులో తాను ఆడకపోవడం కాస్త నిరాశ కల్గించిందని అండర్సన్ తెలిపాడు. నవంబర్ 17 వ తేదీన ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది.