
దోనికి వారెంట్!
సాక్షి, అనంతపురం: భారత క్రికెట్ కెప్టెన్‌ధోనికి అనంతపురం జిల్లా షెడ్యూలు కులాలు, తెగల ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్లు(బీడబ్ల్యూ) జారీ చేసింది. జులై 16లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ప్రముఖ ఆంగ్ల మాసపత్రిక ‘బిజినెస్ టుడే’ 2013, ఏప్రిల్ సంచిక కవరు పేజీపై మహావిష్ణువు ఆకారంలోని ధోని చిత్రాన్ని ముద్రించింది. ఆయుధాలు ఉండే స్థానంలో ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఉత్పత్తులను చూపడం, వాటిలో ఒక చేతిలో పాదరక్షలు పట్టుకున్నట్లు చూపడం వివాదానికి తెర లేపింది.
దీనిపై అనంతపురానికి చెందిన ఎర్రగుంట్ల శ్యామసుందర్ గత ఏడాది జూన్ మూడున కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు.. ఫిర్యాదుదారుడు హాజరు కానందున గత ఏడాది నవంబరులో కేసు కొట్టివేసింది. దానిపై శ్యామసుందర్ జిల్లా సెషన్సు కోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులైన మహేంద్రసింగ్ ధోనికి, బిజినెస్ టుడే సంపాదకుడు చైతన్య కాల్బాగ్‌కుకోర్టు సమన్లు జారీ చేసింది.
చైతన్యాల్ కాల్బాగ్ తరఫున న్యాయవాది యజ్ఞదత్తా (హైదరాబాద్) కోర్టుకు హాజరయ్యారు. అయితే ధోని తరఫున ఎవరూ హాజరు కాలేదు. దాంతో నోటీసులు స్వీకరించని ధోని తిరస్కరణ వైఖరికి కారణాలు తెలపాలంటూ న్యాయమూర్తి విజయకుమార్ మంగళవారం బెయిలబుల్ వారంట్లు జారీ చేశారు.