
సాక్షి, విజయనగరం: సొంతగడ్డపై విజయం సాధించి ఈ సీజన్ రంజీ ట్రోఫీలో బోణీ చేయాలని భావిస్తున్న ఆంధ్ర జట్టుకు మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో మరో అవకాశం లభించింది. గత మూడు మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ఆంధ్ర నాలుగో మ్యాచ్‌లోనూ దానిని పునరావృతం చేసింది. అంతేకాకుండా విజయం సాధించేందుకు అనుకూల పరిస్థితిని సృష్టించుకుంది. పేసర్ బండారు అయ్యప్ప (3/26) సత్తా చాటడంతో మధ్య ప్రదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రకు 55 పరుగుల ఆధిక్యం కోల్పోయిన మధ్యప్రదేశ్ ప్రస్తుతం 12 పరుగులు మాత్రమే ముందంజలో ఉంది.
చివరి రోజు కూడా ఆంధ్ర బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే అవకాశం దక్కవచ్చు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 177/5తో ఆట కొనసాగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ హెబర్ (135 బంతుల్లో 77; 8 ఫోర్లు, 1 సిక్స్), ద్వారకా రవితేజ (167 బంతుల్లో 58; 4 ఫోర్లు) ఆరో వికెట్‌కు 143 పరుగులు జోడించి ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో అయ్యప్ప (32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment