అనిల్‌ కుంబ్లే మళ్లీ కోచ్‌ అవతారం | Anil Kumble Appointed As Kings Punjab Head Coach | Sakshi
Sakshi News home page

అనిల్‌ కుంబ్లే మళ్లీ కోచ్‌ అవతారం

Published Fri, Oct 11 2019 2:52 PM | Last Updated on Sat, Oct 12 2019 10:16 PM

Anil Kumble Appointed As Kings Punjab Head Coach - Sakshi

టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే మళ్లీ కోచ్‌ అవతారం ఎత్తనున్నాడు. అనిల్‌ కుంబ్లేను ప్రధాన కోచ్‌గా నియమించినట్లు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు కింగ్స్‌ పంజాబ్‌కు ప్రధాన కోచ్‌గా కుంబ్లే వ్యవహరించనున్నాడు. ఇక ఇప్పటివరకు కోచ్‌గా ఉన్న మైక్‌ హెసన్‌ కాంట్రాక్ట్‌ ముగిసింది. అయితే అతని కోచింగ్‌లో జట్టు విజయాల్లో, ఆటగాళ్ల ప్రదర్శనలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో అతడికి ఉద్వాసన పలికింది. 

అయితే ఇప్పటివరకు కేవలం ప్రధాన కోచ్‌ను మాత్రమే ఎంపిక చేశామని ఇతర సహాయక సిబ్బంది గురించి ఆలోచించలేదని తెలిపింది. త్వరలో కుంబ్లేతో సమావేశమయ్యాక అతడి సూచనలతో ఇతర సహాయక సిబ్బందిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే ప్రస్తుత సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ను కూడా సాగనంపాలనే ఉద్దేశంలో కింగ్స్‌ పంజాబ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కుంబ్లే నిర్ణయంపైనే అశ్విన్‌ భవిత్యం ఉండబోతోంది. 

గత కొన్ని రోజులుగా కుంబ్లే ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉందని అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుత సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక 2016-2017లో టీమిండియా కోచ్‌గా అనిల్‌ కుంబ్లే వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే కోచ్‌గా విజయవంతమైనా.. సారథితో పాటు ఆటగాళ్లతో పొసగకపోవడంతో కోచ్‌ పదవికి కుంబ్లే రాజీనామా చేశాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు మెంటార్‌గా కుంబ్లే వ్యవహరించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో తొలి సారిగా కోచ్‌ అవతారం ఎత్తుతున్న కుంబ్లే కింగ్స్‌ పంజాబ్‌ రాత మారుస్తాడో లేదో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement